|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 07:22 PM
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద మరోసారి విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర హక్కుల గురించి, విభజన హామీల ఎంపీలు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. ఎక్స్ వేదికగా వైఎస్ షర్మిల సుదీర్ఘ ట్వీట్ చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో.. రాష్ట్ర హక్కుల మీద రాష్ట్ర ఎంపీలు ఎవరైనా మాట్లాడుతారని ఎదురు చూస్తున్నామన్న వైఎస్ షర్మిల. ఈ సమావేశాల్లో కూడా మన ఎంపీలు బుద్ధిమంతులుగా కూర్చుంటున్నారని సెటైర్లు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడితే పోటీపడి చప్పట్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలు నెరవేరక 11 ఏళ్లు దాటిందని.. ఈ విషయం ఎంపీలకు గుర్తుకు ఉందో లేదో తెలియడం లేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు.
ఎంపీలకు ఈ విషయం గుర్తు ఉన్నప్పటికీ గుర్తు లేనట్లు నటిస్తున్నారో అర్ధం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే ఎంపీలకు సొంత ప్రయోజనాలు ముఖ్యమయ్యాయని.. విభజన హామీలు, హక్కుల కంటే మోదీ గారి మెప్పు వీరికి మిన్నగా మారిందని మండిపడ్డారు. ఎంపీలుగా డిల్లీలో పదవులు అనుభవిస్తున్న వారు.. పేరుకు మాత్రమే వేరు వేరు పార్టీలకు చెందిన ఎంపీలని.. నిజానికి రాష్ట్ర ఎంపీలు బీజేపీకి బినామీలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరంతా మోడీ చేతుల్లో రబ్బర్ స్టాంపులుగా మారిపోయారని.. బీజేపీ చేతిలో ఎంపీలు కీలుబొమ్మలయ్యారని మండిపడ్డారు. బీజేపీ బిల్లులకు గొర్రెల్లా తల ఊపడం తప్పా ఎంపీలకు ఏమి చేతకాదని షర్మిల ఆరోపించారు.
" విభజన హామీలు అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన చెక్కు లాంటిది. 2014లోనే విభజన హామీల విలువ 5 లక్షల కోట్లు. చెక్కు మన చేతిలో ఉంది. దాని మనం ఎన్ క్యాష్ చేసుకోలేకపోతున్నాం.పార్లమెంట్ వేదికగా హామీల కమిటీ అమరావతికి కేంద్రం సహాయం చేయలేదని చెప్పినా.. పోలవరం ఎత్తు ఇక 41 మీటర్లే అని లిఖితపూర్వకంగా సమాధానాలు చెప్తున్నా, విభజన హామీల్లో ఇప్పటి వరకు 5 శాతం కూడా అమలు కాకపోయినా, మౌనం వహిస్తూ మన ఎంపీలు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారు. " అంటూ వైఎస్ షర్మిల ఏపీ ఎంపీలపై మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 మంది లోక్ సభ ఎంపీలు,11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. రాజధాని అంశం, కడప స్టీల్ ఫ్యాక్టరీ, దుగరాజపట్నం పోర్ట్, బుందేల్ ఖండ్ తరహాలో వెనుక బడిన 7 జిల్లాలకు ప్యాకేజీ, విశాఖ, విజయవాడలో మెట్రో రైలు, విశాఖ రైల్వే జోన్, చెన్నై-విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ మీద కేంద్రాన్ని ప్రశ్నించాలని షర్మిల డిమాండ్ చేశారు. 11 ఏళ్లు అయినా విభజన హామీల్లో 10 శాతం కూడా అమలు కాలేదని.. ఇంత మోసం జరుగుతుంటే ఎంపీలు గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ఎంపీలు నిజంగా తెలుగు బిడ్డలు అయితే.. మీలో పారుతున్నది తెలుగు వాడి రక్తమే అయితే.. ఓట్లు వేసిన ప్రజల మీద కృతజ్ఞతాభావం మీకుంటే.. విభజన హామీల మీద నోరు విప్పాలంటూ ఆంధ్రప్రదేశ్ ఎంపీలను వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలోని టీడీపీ, వైసీపీ ఎంపీలు.. బీజేపీకి మద్దతుగా నిలుస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపణలు చేస్తున్నారు. ఏపీలో ప్రతిపక్షమనేదే లేకుండా పోయిందని.. అన్ని పక్షాలు బీజేపీకి అనుకూలంగా తయారయ్యాయని షర్మిల విమర్శిస్తున్నారు.
Latest News