|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 09:02 PM
విశాఖపట్నానికి గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్ సహా ఐటీ కంపెనీలు క్యూ కట్టాయి. త్వరలోనే మరికొన్ని కంపెనీలు కూడా రాబోతున్నాయి. ఐటీ కంపెనీలు, పరిశ్రమలు మాత్రమే కాదు.. నగరంలో పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేసే పనిలో ఉంది ప్రభుత్వం.. ప్రణాళికల్ని కూడా సిద్ధం చేస్తోంది. విశాఖపట్నంలో వర్చువల్ గేమింగ్ కోసం ఒక ప్రత్యేక పార్క్ రానుంది. వీఎంఆర్డీఏ (విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ) రుషికొండలో ప్రత్యేక పార్క్‌ను.. 2.82 ఎకరాల్లో రూ.90 కోట్లతో ఈ ప్రాజెక్టును పీపీపీ (ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) కింద నిర్మించనుంది. ఈ పార్క్‌లో వైజాగ్ ఎక్స్పీరియన్స్ అండ్ వర్చువల్ రియాల్టీ ఎరీనా, 3 స్టార్ హోటల్ కూడా ఉంటాయి. ఈ విషయాన్ని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్, కమిషనర్ తేజ్‌భరత్ తెలిపారు.
ఈ కొత్త పార్క్‌లో ఎన్నో ఆకర్షణలు ఉండనున్నాయి. వర్చువల్ ఎక్స్పీరియన్స్, మిక్స్డ్ రియాల్టీ ఎస్కేప్ రూం, లేజర్ షోలు, 360 డిగ్రీల ఇమ్మర్సివ్ థియేటర్, వర్చువల్ టైం ట్రావెల్, వీఆర్ గేమింగ్ జోన్, డ్రైవ్-ఇన్ ఫుడ్ జోన్ వంటివి ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా, ఇక్కడ కేఫ్‌లు, ఫుడ్ కోర్టులు కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికపై కసరత్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. వర్చువల్ రియాల్టీ అంటే కంప్యూటర్ ద్వారా సృష్టించిన ఒక కృత్రిమ ప్రపంచంలో మనం ఉన్నట్లుగా అనుభూతి చెందడం. 360 డిగ్రీల ఇమ్మర్సివ్ థియేటర్ అంటే తెరపై కనిపించే దృశ్యాలు మన చుట్టూ ఉన్నట్లుగా అనిపించడం. మిక్స్డ్ రియాల్టీ అంటే నిజ ప్రపంచంలోకి వర్చువల్ అంశాలను జోడించడం.
విశాఖలో గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం.. టికెట్ల వివరాలివే
విశాఖపట్నం కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశంలోనే అతి పెద్ద గ్లాస్ బ్రిడ్జిగా రూ.7 కోట్లతో వీఎంఆర్డీఏ నిర్మాణం చేశారు. ఈ బ్రిడ్జిని సందర్శించడానికి జనాలు తరలివస్తున్నారు.. పర్యాటకులతో పాటుగా చుట్టుపక్కల జిల్లాలకు చెందిన వారు ఎక్కువమంది వస్తున్నారు. గ్లాస్ బ్రిడ్జిపై నుంచి సముద్రాన్ని చూస్తూ ఫోటోలు, సెల్ఫీలు దిగుతున్నారు.. అక్కడ సందడి వాతావరణం కనిపిస్తోంది. ఛార్జీల విషయానికి వస్తే.. ఒకరికి రూ.250 కాగా, భార్యాభర్తలు ఒక కిడ్‌కు రూ.650గా నిర్ణయించారు. ఇందులో ఫ్యామిలీ కాంబో కింద భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలకు కలిపి రూ.800 ఫిక్స్ చేశారు. ఎవరైనా గ్రూప్‌గా వచ్చి 10మందికిపైగా ఉంటే ఒక్కో టికెట్ రూ.200గా నిర్ణయించారు. అంతేకాదు ఇందులో ఫ్రెండ్స్ కాంబో కింద ఐదుగురు ఉంటే ఒక్కో టికెట్ ధర రూ. 220గా నిర్ణయించారు. ఒక్కొక్కరు గ్లాస్ బ్రిడ్జిపై పదినిమిషాల పాటూ ఉండొచ్చు.. 40మంది చొప్పున బ్రిడ్జి పైకి పంపిస్తున్నారు.