|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 09:00 PM
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓ సలహా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సు కోసం పలువురు రాజకీయ ప్రముఖులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులను గ్లోబల్ సమ్మిట్‌కు రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించారు.
అమరావతిలోని సీఎం చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌కు రావాల్సిందిగా చంద్రబాబును కోమటిరెడ్డి ఆహ్వానించారు.దావోస్ సదస్సు తరహాలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 నిర్వహిస్తున్నట్లు చంద్రబాబుకు వివరించారు. ఈ సదస్సుకు ప్రముఖ వ్యాపారవేత్తలు, ప్రముఖ సంస్థల ప్రతినిధులు, నిపుణులు హాజరవుతున్నట్టు ముఖ్యమంత్రికి వివరించారు.
అనంతరం విలేకర్లతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పలు అంశాలపై స్పందించారు. చంద్రబాబు నాయుడు విజన్ 2020 కి హైదరాబాద్ ప్రతిరూపమని కొనియాడారు. ఏపీ రాజధాని అమరావతి కూడా ఫ్యూచరిస్టిక్ కేపిటల్‌గా అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సలహా ఇచ్చారు. వైఎస్ జగన్‌కు వీలైతే అసెంబ్లీకి వెళ్లాలని సూచించారు. ప్రజాసమస్యలను లేవనెత్తడానికి శాసనసభకు మించిన వేదిక లేదని సూచించారు. ఏ రాష్ట్రంలో అయినా సీఎం తర్వాత.. విపక్ష నేతకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుందన్న కోమటిరెడ్డి.. బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పోరాటాన్ని గుర్తు చేశారు. అప్పట్లో తాము ఆరుగురు ఎమ్మెల్యేలమే అయినప్పటికీ.. అసెంబ్లీకి వెళ్లి బీఆర్ఎస్ మీద పోరాడామని గుర్తు చేశారు. వైఎస్ జగన్ కూడా అసెంబ్లీకి వెళ్లాలని సూచించారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ మీద ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందించారు. పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలను తప్పుబట్టిన కోమటిరెడ్డి.. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే సినిమాలను ఆడనివ్వబోమంటూ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపట్ల వివరణ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించవద్దని కోరింది. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడగా.. తాజాగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వివరణ ఇచ్చారు. అప్పటి పరిస్థితుల కారణంగా అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని.. ప్రజల మధ్య స్నేహం కొనసాగాలనేది తమ అభిలాష అని వెల్లడించారు.