|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 08:51 PM
అమెరికాలో శరణార్థులు, ఆశ్రయం కోరేవారు, ఇతర చట్టపరమైన వలసదారులకు అందించే వర్క్ పర్మిట్ల కాల పరిమితిని ట్రంప్ సర్కార్ భారీగా కుదించింది. ఇప్పటి వరకు ఐదేళ్లుగా ఉన్న గరిష్ట కాల పరిమితిని కేవలం 18 నెలలకు తగ్గిస్తున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ గురువారం ప్రకటించింది. ఇమ్మిగ్రేషన్ నియమాలను కఠినతరం చేసే దిశగా చేపట్టిన అత్యంత ముఖ్యమైన చర్యల్లో ఇది కూడా ఒకటి కాగా.. అమెరికాలోని విదేశీ ఉద్యోగులు తెగ ఆందోళన చెందుతున్నారు.
ఈ మార్పు తరచుగా భద్రతా సమీక్షలు నిర్వహించడానికి దోహదపడుతుందని USCIS తెలిపింది. "ఉద్యోగ అనుమతి గరిష్ట కాల పరిమితిని తగ్గించడం ద్వారా అమెరికాలో పని చేయాలనుకునే వారు ప్రజల భద్రతకు ముప్పు కలిగించకుండా లేదా హానికరమైన అమెరికా వ్యతిరేక సిద్ధాంతాలను ప్రోత్సహించకుండా చూసుకోవచ్చు" అని ఏజెన్సీ తన ప్రకటనలో పేర్కొంది. గతేడాది వాషింగ్టన్ డీసీలో ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులపై జరిగిన దాడిని USCIS ఈ విధాన మార్పుకు రుజువుగా చూపింది. ఈ దాడి తరువాత వలసదారులపై మరింత తరచుగా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని USCIS డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో అన్నారు. దాడికి పాల్పడిన ఆఫ్ఘన్ జాతీయుడు రహమనుల్లా లకన్‌వాల్‌కు ఏప్రిల్ 2025లో ఆశ్రయం లభించింది.
సవరించిన నిబంధనల ప్రకారం.. శరణార్థులు, ఆశ్రయం పొందిన వారు, గ్రీన్ కార్డ్ నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులు వంటి వారికి వర్క్ పర్మిట్ గడువు ఐదేళ్ల నుంచి 18 నెలలకు పరిమితం అవుతుంది. పరిపాలన మద్దతు ఉన్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ ప్రకారం.. టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ (TPS) హోల్డర్లు, పెండింగ్‌లో ఉన్న TPS దరఖాస్తుదారులు వంటి వారికి వర్క్ పర్మిట్ గడువు వారి అధికారిక బసను బట్టి ఒక సంవత్సరం లేదా అంతకంటే తక్కువకు కుదించబడుతుంది. అయితే ఈ మార్పులు డిసెంబర్ 5వ తేదీ లేదా ఆ తర్వాత దాఖలు చేయబడిన పెండింగ్‌లో ఉన్న, భవిష్యత్తులో వచ్చే అన్ని ఫారం I-765 దరఖాస్తులకు తక్షణమే వర్తిస్తాయి.
వర్క్ పర్మిట్లను తరచుగా (ప్రతి 18 నెలలకు) రెన్యూవల్ చేయమని దరఖాస్తుదారులను బలవంతం చేయడం వల్ల.. ఇప్పటికే రికార్డు బ్యాక్‌లాగ్‌లతో ఇబ్బంది పడుతున్న వ్యవస్థలో మరింత జాప్యం పెరుగుతుందని వలసదారుల న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం దీనిని అవసరమైన ప్రజా భద్రతా చర్యగా వాదిస్తున్నప్పటికీ.. ఆశ్రయం కోరుకునేవారిని దేశంలో ఉండకుండా నిరుత్సాహ పరచడానికి చేసిన ప్రయత్నమని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
Latest News