|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 08:27 PM
కర్ణాటకలోని హవేరి జిల్లాలో ఉన్న సీజే బెల్లాడ్ ప్రభుత్వ ప్రథమ శ్రేణి కళాశాలలో గురువారం రోజు మళ్లీ గొడవ చెలరేగింది. ముఖ్యంగా బురఖా, కాషాయ కండువాలకు సంబంధించిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కొందరు విద్యార్థినులు బురఖా ధరించి తరగతులకు హాజరు కావడాన్ని నిరసిస్తూ.. తోటి విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి కాలేజీకి రావడంతో గందరగోళం నెలకొంది.
బురఖా వర్సెస్ కాషాయ కండువా..
బురఖాలు ధరించి తరగతులకు వచ్చిన విద్యార్థినుల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. మరికొందరు విద్యార్థులు కాషాయ కండువాలు వేసుకుని తరగతి గదులకు హాజరయ్యారు. హిజాబ్ వేసుకు రావడం మానేయాలంటూ నినాదాలు చేశారు. కళాశాలలోకి బురఖాలు వేసుకు రానిస్తే.. తాము కచ్చితంగా కాషాయ కండువాలు వేసుకుని వస్తామంటూ రచ్చ చేశారు. రెండు నెలల క్రితం కూడా బీఏ రెండు, మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఇదే గొడవ చేశారు. యజమాన్యం జోక్యం చేసుకోవడంతో.. గొడవ కాస్తా సద్దుమణిగింది. కానీ తాజాగా మరోసారి గొడవ జరగడంతో.. యాజమాన్యం షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
ముఖ్యంగా ఉద్రిక్తతను గమనించిన కళాశాల యాజమాన్యం గురువారం అత్యవసర సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణను కాపాడేందుకు అధికారిక కళాశాల యూనిఫాంకు మాత్రమే విద్యార్థులు కట్టుబడి ఉండాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల ఇష్ట ప్రకారమే.. కళాశాలలోని విద్యార్థులంతా యూనిఫాం వేసుకుని వచ్చేలా నిర్ణయించింది. కచ్చితంగా విద్యార్థులంతా ఈ నిర్ణయాన్ని గౌరవించి, పాటించారని మార్గదర్శకాలను జారీ చేసింది. కళాశాల ప్రిన్సిపాల్ వీరేశ్ మాట్లాడుతూ,, "రెండు నెలల క్రితం తొలిసారి గొడవ జరిగింది. అప్పుడు హెచ్చరిక జారీ చేయడంతో గొడవ సద్దుమణిగింది. కానీ మళ్లీ ఈ విషయంపై నిరసన చేపట్టగా.. ఈ నిర్ణయం తీసుకున్నాం. విద్యార్థులు కూడా దీనికి అంగీకరించారు" అని తెలిపారు.
"మేము విద్యార్థులను ఒప్పిస్తాము. క్రమశిక్షణను నిర్ధారించడానికి సిబ్బంది తరచుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మేము దీన్ని మళ్లీ చేస్తాము" అని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదం దేశంలో గతంలో హిజాబ్ అంశంపై జరిగిన చర్చను గుర్తు చేసింది. కళాశాల యాజమాన్యం కఠినమైన యూనిఫాం ఆదేశాలు జారీ చేయడంతో ఈ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగే అవకాశం ఉంది.