|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 07:55 PM
భారత్, రష్యా మధ్య దశాబ్దాలుగా మంచి మైత్రి బంధం ఉంది. చాలా రంగాల్లో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు, ఒప్పందాలు, సహకారాలు, ఎగుమతులు-దిగుమతులు.. ఉన్నాయి. అంతర్జాతీయ వేదికలపైనా భారత్, రష్యా పరస్పరం సహకరించుకుంటాయి. అందుకే భారత్, రష్యాలు చిరకాల మిత్రులుగా ప్రపంచ దేశాలు పిలుస్తాయి. అయితే అదే సమయంలో మన పొరుగు దేశమైన పాకిస్తాన్‌తో మాత్రం రష్యాకు సత్సంబంధాలు లేవు. అందుకే గత కొన్నేళ్లల్లోనే పాక్ గడ్డపై రష్యా అధినేతలు, నాయకులు అడుగు పెట్టలేదు. ఇక పుతిన్ అధ్యక్షుడు అయినప్పటినుంచి.. పాక్‌లో అడుగు కూడా పెట్టలేదు. దీన్ని బట్టి చూస్తేనే.. రష్యా, పాక్‌కు మధ్య సంబంధాలు ఎంత దూరంలో ఉన్నాయో అర్థం అవుతోంది.
ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో.. రష్యా అగ్రనేతలు పాకిస్తాన్‌లో అధికారిక పర్యటనలు చేయకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిన తర్వాత 2007లో పాకిస్తాన్‌ను సందర్శించిన ఏకైక రష్యా అగ్రనేత ప్రధానమంత్రి మైఖైల్ ఫ్రాడ్కోవ్ మాత్రమే. అప్పటి నుంచి ఇప్పటివరకు పుతిన్ ఒక్కసారి కూడా పాకిస్తాన్ వెళ్లకపోవడం గమనార్హం. అయితే దీని వెనుక చారిత్రక, వ్యూహాత్మక, దౌత్యపరమైన కారణాలు ఉన్నాయి.
పాకిస్తాన్‌ను పుతిన్ సందర్శించకపోవడానికి ప్రధాన కారణం భారత్‌తో రష్యాకు ఉన్న బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం. కోల్డ్ వార్ వారసత్వం, కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా రష్యా వైఖరి వంటి చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా.. అగ్రనేతలు పర్యటించేలా.. రష్యా-పాకిస్తాన్ మధ్య కీలక ఒప్పందాలు, భారీ ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలు లేకపోవడం కూడా ఒక కారణం. ఇక 2012లో పుతిన్ పాక్ పర్యటన రద్దుకు ప్రధాన కారణాలు ఇవే. భారత్‌ను దూరం చేసుకోకుండా పాకిస్తాన్‌తో అగ్రస్థాయి సంబంధాలను పరిమితం చేసుకోవడానికి రష్యా మొగ్గు చూపుతోంది.
కోల్డ్ వార్ వారసత్వం, చారిత్రక ఇబ్బందులు
1991కి ముందు.. సోవియట్ యూనియన్ కాలంలో అమెరికా నాయకత్వంలోని సైనిక కూటముల్లో పాకిస్తాన్ భాగమైంది. దీనికి విరుద్ధంగా.. సోవియట్ యూనియన్ భారత్‌తో బలమైన సంబంధాన్ని కొనసాగించింది. ఈ చారిత్రక వైరుధ్యం కారణంగా.. రష్యా-పాకిస్థాన్ సంబంధాలు బలపడటం అటుంచితే.. అనుమానం, అవిశ్వాసంగా మారాయి. మరోవైపు.. ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా.. భారతదేశానికి అనుకూల వైఖరిని రష్యా సమర్థించింది. వీటికి తోడు 1979-1989 మధ్య సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధం జరిగిన సమయంలో పాకిస్తాన్ ముజాహిదీన్లకు మద్దతు ఇవ్వడం రష్యాతో సత్సంబంధాలు పెరగకపోవడానికి కారణాలుగా నిలిచాయి.
భారత్‌తో రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం
రష్యా తన విదేశాంగ విధానంలో భారత్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ పర్యటనలు లేకపోవడానికి అతిపెద్ద కారణం. రష్యాకు ఆయుధాలు, ఆర్థిక, సైనిక రంగాల్లో దీర్ఘకాలిక, అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామిగా భారత్ కొనసాగుతోంది. భారత్‌కు సున్నితమైన అంశంగా ఉండే పాకిస్తాన్‌తో అత్యున్నత స్థాయి పర్యటనలు చేయడం వల్ల.. రష్యాకు భారత్‌తో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చనే కారణాలతో.. రష్యా తన మిత్రుడిని దూరం చేసుకోకుండా ఉండటానికి.. పాకిస్తాన్‌తో స్నేహపూర్వక సంబంధాలను పరిమితం చేసుకుంటోంది.
2012 పర్యటన రద్దు
సాధారణంగా రష్యా అగ్రనేతలు ఏదైనా దేశంలో సరదాగా పర్యటించడానికి ఇష్టపడరు. ఏ దేశంలో అయినా పర్యటించాలంటే.. భారీ ఎత్తున వ్యూహాత్మక లేదా ఆర్థిక ప్రయోజనం ఉండాలని భావిస్తారు. 2012లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాకిస్తాన్‌లో జరిగిన ఒక సమావేశానికి హాజరు కావాల్సి ఉండగా.. అది చివరి నిమిషంలో రద్దయింది. దానికి గల ప్రధాన కారణాల్లో ఒకటి.. ఆ పర్యటనలో రష్యా-పాకిస్తాన్ మధ్య పెద్ద ఒప్పందాలు లేకపోవడమేనని అప్పట్లో వార్తలు వచ్చాయి. భారీ వాణిజ్య ఒప్పందాలు, పెట్టుబడి ప్రణాళికలు లేదా కీలకమైన వ్యూహాత్మక ప్రకటనలు సిద్ధంగా ఉన్నప్పుడే పాకిస్తాన్‌కు తమ అధ్యక్షుడు వెళ్తారని రష్యా రాయబారి గతంలోనే స్పష్టం చేశారు. అయితే పాకిస్తాన్‌తో రష్యాకు అలాంటి భారీ స్థాయి ఆర్థిక సహకారం ఇప్పటికీ జరగకపోవడం ఒక కారణం.
భద్రతా అంశాలు, అస్థిరత
పాకిస్తాన్‌లో తరచుగా సంభవించే రాజకీయ, భద్రతా అస్థిరత కారణంగా కూడా అగ్రనేతలు ఆ దేశంలో పర్యటించేందుకు రష్యా మొగ్గు చూపడం లేదు. ఏది ఏమైనా.. ఆఫ్ఘనిస్తాన్, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం వంటి భద్రతా అంశాలపై మాత్రం రష్యా, పాకిస్తాన్ రెండు దేశాల మధ్య సహకారం కొనసాగుతోంది.