|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 06:31 AM
తెలుగుదేశం పార్టీలో వ్యక్తులు శాశ్వతం కాదని, పార్టీయే శాశ్వతమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. నాయకులు పార్టీని వీడినా కార్యకర్తలే అండగా నిలిచి చారిత్రక విజయాన్ని అందించారని కొనియాడారు. పాలకొండ నియోజకవర్గంలోని భామినిలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడటం వెనుక దశాబ్దాలుగా పసుపు జెండాను వీడని కార్యకర్తల కష్టం, త్యాగం ఉన్నాయి. అందుకే ఎక్కడికి వెళ్లినా ముందుగా కార్యకర్తలను కలిశాకే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాం. గడిచిన ఐదేళ్ల సైకో పాలనలో నాపై హత్యాయత్నం కేసులు సహా అనేక అక్రమ కేసులు బనాయించారు. అయినా కరుడుగట్టిన కార్యకర్తల స్ఫూర్తితోనే ముందుకు సాగాను అని తెలిపారు. పల్నాడులో ప్రాణాలు పోతున్నా ‘జై టీడీపీ’ అన్న తోట చంద్రయ్య వంటి కార్యకర్తల త్యాగం మరువలేనిదని గుర్తు చేసుకున్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే అనేక హామీలను నెరవేరుస్తున్నామని లోకేశ్ వివరించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నామని, మెగా డీఎస్సీని 150 రోజుల్లో పూర్తి చేశామని చెప్పారు. ఉత్తరాంధ్ర ఇప్పుడు వెనుకబడిన ప్రాంతం కాదని, భోగాపురం ఎయిర్‌పోర్టు, గూగుల్ వంటి ప్రాజెక్టులతో రాష్ట్రానికి వెన్నెముకగా మారుతోందని అన్నారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్‌పై లోకేశ్ విమర్శలు గుప్పించారు. తిరుమల పరకామణిలో రూ.50 కోట్లు దొంగిలిస్తే అది చిన్న దొంగతనమంట. ఇది ఆయన దృష్టిలో చిన్న విషయమా దేవుడే ఆయన్ను చూసుకుంటాడు అని వ్యాఖ్యానించారు. చట్టబద్ధమైన పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే టీడీపీ కార్యకర్తలను అధికారులు గౌరవించాలని, వారి పనులు చేసి పెట్టాలని స్పష్టం చేశారు. గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికి, రాబోయే 15 ఏళ్లు కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, కింజరపు అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Latest News