|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 08:34 PM
రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికొద్దిరోజుల్లో భారతదేశానికి రానున్నారు. ఆయన రాక దేశంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి పుతిన్ రాక శైలి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.పుతిన్ రెండు ఒకేలా కనిపించే విమానాల్లో ప్రయాణిస్తున్నారు. IL-96-300PU మోడల్‌కు చెందిన ఈ రెండు విమానాల రూపురేఖలు కూడా ఒకేలా ఉన్నాయి. దీనిలో ఒకటి నిజమైన విమానం, మరొకటి నకిలీ — దీనిని డెకాయ్ ఫ్లైట్ అంటారు. ఏ విమానంలో అధ్యక్షుడు ఉన్నారో ఎవరూ గుర్తించలేరు. ఈ రెండు విమానాలు తరచుగా ఒకే రూట్‌లో ఎగురుతూ, కొన్ని సమయాల్లో రాడార్‌కి కనిపించకపోవడం వల్ల భద్రత పెరుగుతుంది. ఉక్రెయిన్ యుద్ధం, యూరోపియన్ దేశాల అసంతృప్తి నేపథ్యంలో రష్యా భద్రతా సంస్థలు ఈ ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి.పుతిన్ విమానం కజకిస్తాన్ మార్గంలో ఎగురుతున్నప్పుడు డెకాయ్ డ్రిల్ ప్రారంభమవుతుంది. రెండు విమానాలు ఒకే రూట్‌లో, ఒకదాని దగ్గరగా ఎగురుతూ, RSD221 మరియు RSD369 అనే గుర్తులతో కనిపిస్తాయి. అయితే, పుతిన్ ఏ విమానంలో ఉన్నారో తెలుసుకోవడం కష్టమే.IL-96 మోడల్ ప్రత్యేకతలతో ఉంటుంది. ఇది సాధారణ విమానం కాదు. దీనిలో పుతిన్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా రష్యా అణు దళాలను కంట్రోల్ చేయగలరు. ఫ్లైట్‌లో శాటిలైట్ ఫోన్లు, జామింగ్ సిస్టమ్‌లు, ప్రత్యేక క్షిపణి రక్షణ పరికరాలు అమర్చబడ్డాయి. ఇంధనంతో ఇది 13,000 కిలోమీటర్ల దూరం ఎగురవచ్చు.గతంలో కూడా పుతిన్ భద్రత కోసం రష్యా సెక్యూరిటీ “డబుల్ షీల్డ్ ప్రోటోకాల్”ని ఉపయోగించింది. అంటే, డ్రోన్ లేదా క్షిపణితో దాడి చేయాలంటే మొదట పుతిన్ ఏ విమానంలో ఉన్నారో తెలుసుకోవాలి. కానీ అది అసాధ్యం, ఎందుకంటే ఈ రెండు విమానాలు కొన్ని నిమిషాలకొకసారి రాడార్ సిగ్నల్స్ ఆన్/ఆఫ్ చేస్తాయి. కొన్ని సార్లు ఒకటి, మరికొన్నిసార్లు రెండూ కనిపించవు. దీంతో పుతిన్ ఎక్కడికి వెళ్లాలనుకున్నా అత్యంత సురక్షితంగా, ఎటువంటి ఆటంకం లేకుండా ప్రయాణించగలరు.
Latest News