|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 07:58 PM
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ సాయంత్రం ఢిల్లీకి చేరుకోనున్నారు. 23వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న ఆయన భద్రతా ఏర్పాట్లపై చర్చ జరుగుతుండగానే, ఆయన వ్యక్తిగత సంపద ఎంత అనే అంశం మరోసారి అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.క్రెమ్లిన్ అధికారిక లెక్కల ప్రకారం పుతిన్ ఒక సాధారణ ప్రజా సేవకుడు. ఆయన వార్షిక జీతం సుమారు 140,000 డాలర్లు ఆయన పేరు మీద 800 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్, ఒక చిన్న భూమి, మూడు వాహనాలు మాత్రమే ఉన్నాయని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. అయితే, అంతర్జాతీయ నిపుణులు, ఫైనాన్షియర్లు వేస్తున్న అంచనాలు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. పుతిన్ ఆస్తి విలువ దాదాపు 200 బిలియన్ డాలర్లు ఉండొచ్చని, ఒకప్పుడు రష్యాలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా ఉన్న బిల్ బ్రౌడర్ 2017లోనే అమెరికా సెనేట్‌కు తెలిపారు. ఇది నిజమైతే, పుతిన్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో బిల్ గేట్స్ వంటి వారిని కూడా అధిగమిస్తారు.పుతిన్ అధికారిక జీతం కంటే కొన్ని రెట్లు ఎక్కువ విలువైన లగ్జరీ వాచ్‌లు ధరించి కనిపిస్తుంటారు. అంతేకాకుండా సుమారు రూ.6,000 కోట్ల విలువైన సూపర్ యాట్, నల్ల సముద్రం తీరంలో ఉన్న బిలియన్ డాలర్ల 'పుతిన్ ప్యాలెస్' వంటి అత్యంత ఖరీదైన ఆస్తులతో ఆయనకు సంబంధం ఉందని బ్రిటన్ విదేశాంగ కార్యాలయం గతంలో వెల్లడించింది. ఈ ప్యాలెస్ అధికారికంగా ఆయన సన్నిహితుడి పేరు మీద ఉంది.
Latest News