|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 07:23 AM
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి ‘ఇంద్రధనస్సు’ పేరుతో 7 వరాలను ప్రకటించారు. దీంతో పాటు ఇటీవల అంధ మహిళల ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులకు భారీ నజరానాలు ప్రకటించి అండగా నిలిచారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అంధ మహిళల క్రికెట్ జట్టు సభ్యులు కరుణ కుమారి, దీపిక దేశం గర్వపడేలా రాణించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కరుణ కుమారికి రూ.15 లక్షల నగదు, ఇంటి నిర్మాణానికి సాయం అందిస్తామని ప్రకటించారు. మరో క్రీడాకారిణి దీపికకు రూ.10 లక్షల ప్రోత్సాహకం, ఇంటి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. వారి కోచ్ అజయ్ కుమార్ రెడ్డికి రూ.2.50 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. ఇదే వేదికపై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరపున అంధ మహిళల క్రికెట్ జట్టుకు రూ.10 లక్షల చెక్కును, గొట్టిపాటి హర్షవర్ధన్, ఏసీఏ తరపున కరుణకుమారికి మరో రూ.10 లక్షల చెక్కును సీఎం అందజేశారు.ఈ కార్యక్రమంలో చంద్రబాబు దివ్యాంగులకు 7 వరాలను ప్రకటించారు. మహిళల మాదిరిగానే దివ్యాంగులకూ ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల్లో దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేయడం, అమరావతిలో ‘దివ్యాంగ్ భవన్’ ఏర్పాటు, ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులలో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు వంటి కీలక హామీలు ఇచ్చారు.దివ్యాంగులు బలహీనులు కాదని, విభిన్న ప్రతిభావంతులని సీఎం అన్నారు. పట్టుదలకు వారు చిరునామా అని కొనియాడారు. దివ్యాంగుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న ప్రేమకు నిదర్శనమే రూ.6వేల పింఛను అని గుర్తుచేశారు. గత ప్రభుత్వం దివ్యాంగులను నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా నిలుస్తుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అనంతరం పలువురు దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు.
Latest News