|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 11:38 PM
మరో 2 నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించిన జెర్సీని భారత మాజీ కెప్టెన్, టీ20 ప్రపంచకప్ అంబాసిడర్ రోహిత్ శర్మ ఆవిష్కరించాడు. బుధవారం దక్షిణాఫ్రికాతో రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డే ఇన్నింగ్స్ విరామ సమయంలో ఈ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడైన రోహిత్.. ముఖ్య అతిథిగా హాజరై టీమిండియా జెర్సీ ని రివీల్ చేశాడు. అతడితో పాటు టీమిండియా టీ20 ప్లేయర్ తిలక్ వర్మ కూడా ఉన్నాడు. వారితో పాటు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియాతో పాటు టీమిండియా జెర్సీ స్పాన్సర్స్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాయ్‌పూర్ వన్డేలో భారత బ్యాటింగ్ ముగియగానే భారీ సైజ్ టీ20 ప్రపంచకప్ జెర్సీని మైదానంలో ప్రదర్శించారు. అనంతరం తెలుగు క్రికెటర్ తిలక్ వర్మతో కలిసి రోహిత్ శర్మ ఈ జెర్సీలతో ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. నీలిరంగులో ఉన్న ఈ జెర్సీ.. 2 వైపులా వైబ్రెంట్ ఆరెంజ్ ప్యానెల్స్ ఉన్నాయి. జెర్సీపై వర్టికల్ బ్లూ స్ట్రైప్స్ ఉన్నాయి.
కాగా గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలిపిన రోహిత్ శర్మ.. ట్రోఫీని రెండోసారి ముద్దాడేందుకు 15 ఏళ్లకు పైగా నిరీక్షించాల్సి వచ్చిందని చెప్పాడు. ట్రోఫీ అందుకోవడం గొప్పగా అనిపించిందని పేర్కొన్నాడు. ఈసారి కూడా భారత జట్టు కప్‌ను గెలిచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తుందని జోస్యం చెప్పాడు.
కాగా ఇటీవలే ఐసీసీ.. టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టోర్నీ జరగనుంది. భారత్, శ్రీలంక సంయుక్త వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్‌లోని ఐదు వేదికలు అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబైలో మ్యాచ్‌లు జరుగుతాయి. శ్రీలంకలోని మూడు వేదికలు ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
టీ20 ప్రపంచకప్ లీగ్ స్టేజ్‌లో భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్..
*ఫిబ్రవరి 7 - యూఎస్‌ఏతో.. (వేదిక: ముంబై)
*ఫిబ్రవరి 12 - నమీబియాతో.. (వేదిక: దిల్లీ)
*ఫిబ్రవరి 15 - పాకిస్థాన్‌తో.. (వేదిక: ప్రేమదాస స్టేడియం, కొలంబో )
*ఫిబ్రవరి 18 - నెదర్లాండ్స్‌తో.. (వేదిక: అహ్మదాబాద్).