|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 07:27 PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లోకి మరో వారసురాలు ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం అయింది. ఇటీవల వంగవీటి రంగా విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత.. ఆయన కుమార్తె ఆశా కిరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తానన్నారు. గత కొంత కాలంగా ప్రజా జీవితానికి దూరంగా ఉన్నానని.. ఇకపై తన పూర్తి ప్రయాణం ప్రజలతోనే ఆశా కిరణ్ చెప్పారు. ఇకపై విజయవాడ ప్రజలకు ఏ కష్టం వచ్చినా.. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దీంతో ఆమె రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తన పొలిటికల్ ఎంట్రీపై ఆశా కిరణ్ క్లారిటీ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా రంగా మిత్ర మండలి..
వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా రంగనాడు' పేరుతో డిసెంబరు 26న విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రాధా రంగ రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగనాడు పోస్టర్‌ను రంగ ఆశా కిరణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆశా కిరణ్.. రాధా రంగ మిత్ర మండలి సభ్యులను చూస్తే ఒక కుటుంబాన్ని చూసినట్లుగా అనిపిస్తోందన్నారు. రంగనాడు.. కుల, మత, రాజకీయాలకు అతీతంగా జరిగుతోందన్నారు. ఇది రంగా అభిమానులు కోసం నిర్వహించే సభ అని.. అన్ని పార్టీల్లో ఉన్న రంగా అభిమానులు రావాలని పిలుపునిచ్చారు. చేయి చేయి కలుపు చేజారదు అంటూ తన తండ్రి రంగా చెప్పేవారని.. ఇప్పుడు అదే నినాదంతో రాధారంగ మిత్ర మండలిని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేస్తామని ఆశా కిరణ్ అన్నారు.
పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ..
ఈ సందర్భంగా తన పొలిటికల్ ఎంట్రీపై వంగవీటి ఆశా కిరణ్ క్లారిటీ ఇచ్చారు. రాజకీయ అరంగేట్రంపై ఇప్పటివరకు ఎలా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇక్కడికి రాధారంగ మిత్ర మండలి తరఫున పనిచేయడానికి మాత్రమే వచ్చానన్నారు. తనకు ఇప్పుడు ఏ పార్టీతో సంబంధం లేదని, చారిటీ కింద రాధారంగ మిత్ర మండలి పని చేస్తుందని తెలిపారు. తన రాజకీయ నిర్ణయం ఏమైనా ఉంటే తర్వాత చెబుతానన్నారు. అందుకే ఎటువంటి రాజకీయ ప్రకటన చేయడం లేదని.. ఏ పార్టీ లో చేరడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ప్రజలకు తన వంతుగా సేవ చేస్తానని, రాధా రంగ మిత్ర మండలి కార్యక్రమం విస్తృతం చేస్తామని చెప్పారు. వచ్చే మూడేళ్లు తన పని తీరు, సేవా కార్యక్రమాలను అందరూ చూస్తారని.. ఆ తర్వాత రాధారంగ మిత్ర మండలి పెద్దల ఆదేశాలు, సూచనల ప్రకారం తన రాజకీయ నిర్ణయం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
అన్నతో ఎలాంటి విభేదాలు లేవు..
తన సోదరుడు వంగవీటి రాధాకృష్ణతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆశా కిరణ్ తెలిపారు. అనవసరంగా తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. విశాఖలో జరిగే సభకు వంగవీటి రాధాకృష్ణను కూడా ఆహ్వానించారని చెప్పారు.
Latest News