|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 07:19 PM
అతనో ప్రైవేట్ ఉద్యోగి.. ఊరు కృష్ణా జిల్లాలోని పెనమలూరు.. ప్రైవేట్ ఉద్యోగం, సరిపడా జీతం.. చక్కగా సాగిపోతున్న జీవితం.. కానీ ఓ మెసేజ్ ఆయన జీవితాన్ని తలకిందులు చేస్తుందని ఊహించలేకపోయాడు. అనుకోకుండా వచ్చిన ఓ మెసేజ్‌కు రిప్లై ఇవ్వడం.. చక్కగా సాగిపోతున్న అతని జీవితాన్ని మార్చేసింది. చివరకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ట్రేడింగ్ వ్యాపారంలో భారీ లాభాలంటూ ఓ వ్యక్తిని మోసం చేసిన మహిళ అతడి బ్యాంక్ ఖాతా నుంచి రూ.26.37 లక్షలు కాజేసింది.. పెనమలూరుకు చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు ఉద్యోగి. కొన్ని రోజుల క్రితం అతని సెల్‌ఫోన్‌కు గుర్తు తెలియని నంబర్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ఎవరా అని రిప్లై ఇస్తే.. తన పేరు అన్నమనేని హేమాచౌదరిగా అవతలి వ్యక్తి పరిచయం చేసుకుంది. తన సొంతూరు రాజమండ్రి అని.. ప్రస్తుతం చెన్నైలో ఉన్నట్లు చెప్పింది.
ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. ఈ క్రమంలోనే తన మాటలతో అతన్ని ఆకట్టుకుంది అవతలి వ్యక్తి. క్రమంగా తనపై నమ్మకం పెంచుకుంది. షేర్ల వ్యాపారం గురించి ప్రైవేట్ ఉద్యోగికి తెలియజేస్తూ.. ట్రేడింగ్ చేస్తే భారీగా లాభాలు వస్తాయని అతనికి ఆశ చూపించింది. ఎలా ట్రేడింగ్ చేయాలనే దానిపై వాట్సాప్ ద్వారా లింక్ పంపించి సూచనలు చేసింది. దీంతో ఆమె మీద నమ్మకంతో మనోడు తొలుత 50 వేల రూపాయలతో ట్రేడింగ్ ప్రారంభించాడు. అతనికి నమ్మకం కలిగించేందుకు తొలుత లాభాలు వచ్చినట్లు ఆన్‌లైన్‌లో చూపించారు. దీంతో మనోడికి నమ్మకం కలిగింది. లాభం వచ్చిన డబ్బులను విత్ డ్రా చేసుకున్నాడు. ఆ తర్వాత మరిన్ని లాభాలు వస్తాయని చెప్పటంతో పలు దఫాలుగా రూ. రూ.26.37 లక్షలు ట్రేడింగ్‌లో పెట్టాడు.
మనోడికి నమ్మకం కలిగించటం కోసం ఈ పెట్టుబడికి లాభం వచ్చినట్లు చూపించారు. లాభంతో కలిపి రూ.40.96 లక్షలు వచ్చినట్లు ఆన్‌లైన్‌లో చూపించారు. దీంతో ప్రైవేట్ ఉద్యోగి ఈ ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలని ప్రయత్నించాడు. అయితే అందుకు వీలు కుదరలేదు. దీంతో తనకు ట్రేడింగ్ పరిచయం చేసిన హేమా చౌదరిని సంప్రదించే ప్రయత్నం చేశాడు.
అయితే ఆమె సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన ప్రైవేట్ ఉద్యోగి.. పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. హేమా చౌదరి కోసం ఆరా తీస్తున్నారు. అయితే రెట్టింపు లాభాలు అంటూ ఇలా ట్రేడింగ్ పేరుతో వచ్చే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
Latest News