|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:28 PM
ఆంధ్రప్రదేశ్ ఎండీసీని ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో గనుల తవ్వకాలు, ఉచిత ఇసుక అమలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "లీజుకిచ్చిన గనులు కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా అక్రమ తవ్వకాలు జరిగితే వాటిని ఆర్టీజీఎస్ వ్యవస్థ ద్వారా గుర్తించేలా చూడాలి. దీని కోసం డ్రోన్, శాటిలైట్ చిత్రాలను వినియోగించుకోవాలి. అలాగే గనుల ద్వారా వచ్చే ఆదాయం విషయంలో ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను అంచనా వేసుకోవాలి. గనుల ద్వారా ఆదాయాన్ని పొందుతున్న రాష్ట్రాల్లో ఒడిశా మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో ఎలాంటి పద్ధతులను అనుసరిస్తున్నారో గమనించి వాటిని మన రాష్ట్రంలో అమలు చేసే అంశాన్ని పరిశీలించాలి. అలాగే గనుల నుంచి వచ్చే వివిధ ఖనిజాలకు సంబంధించిన ముడి సరుకును ఇతర దేశాలకు ఎగుమతి చేయడంతోపాటు ఆ ఖనిజాలకు వాల్యూ యాడెడ్ చేయడం ద్వారా దేశీయంగా వాటిని వినియోగించుకుని మరింత ఆదాయం వచ్చేలా చేయాలి. విశాఖలో పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయి. బాగా అభివృద్ధి జరగబోతోంది. ఉత్తరాంధ్ర కేంద్రంగా మెటల్ కు సంబంధించిన క్లస్టర్ ఏర్పాటు చేయండి. విశాఖలో ఏర్పాటు కాబోయే వివిధ కంపెనీల నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ సరఫరా జరిగేలా చూడాలి" అని ముఖ్యమంత్రి సూచించారు.
Latest News