|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:15 PM
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ పదవికి అనర్హుడని, ఆయన్ను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ డిమాండ్ చేశారు. ఇటీవల కోనసీమ జిల్లా పర్యటనలో పవన్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా, ప్రజల ఐక్యతకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు.తెలుగు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ, ప్రజల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని నారాయణ గుర్తుచేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుమార్తెను ఏపీలోని భీమవరానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో పవన్ వ్యాఖ్యలు ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు.రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో చేగువేరా తనకు ఆదర్శమని చెప్పిన పవన్, ఇప్పుడు సావర్కర్‌ను భుజానకెత్తుకుని 'సనాతన ధర్మం' అంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు నిజంగా సనాతన ధర్మంపై ఆసక్తి ఉంటే, రాజకీయాలు వదిలిపెట్టి ఆ మార్గంలో వెళ్లవచ్చని సూచించారు.'దిష్టి తగిలింది' వంటి మాటలు మాట్లాడే సనాతనవాదులకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని నారాయణ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు తగరని, ఆయన్ను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
Latest News