|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 12:47 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగం రోడ్డుపై నిలబడే పరిస్థితి తెచ్చారని వైయస్‌ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక 18 నెలల నుంచి ఏ పంటకూ మద్దతు ధర కల్పించలేదని మండిపడ్డారు. మంగళవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతపురం జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. విత్తనం నుంచి ఎరువులు, పంట విక్రయం వరకు రైతాంగం రోడ్డెక్కే పరిస్థితులు తెచ్చారని విమర్శించారు. రైతుల కష్టాలు ఏ ప్రజాప్రతినిధికీ పట్టడం లేదని.. చెవులు, కళ్లున్నా వినలేని..చూడలేని స్థితిలో వాళ్లున్నారని విమర్శించారు. గత ఖరీఫ్, రబీ సీజన్లలోనూ రైతులు తీవ్రంగా నష్టపోయారని..ఈ ఖరీఫ్‌లోనూ అదే పరిస్థితి వచ్చిందన్నారు. పంట మార్పిడి చేసుకున్నా గిట్టుబాటు ధరలు దక్కడం లేదని అన్నారు. ఎన్నడూ లేని విధంగా అనంతపురం జిల్లాలో ఈ ఏడాది లక్ష ఎకరాలు బీడుగా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు చేసిన పంటలు దిగుబడులు రావడం లేదని, వచ్చిన పంటను అమ్ముకుందామన్నా గిట్టుబాటు ధరలు ఉండడం లేదని చెప్పారు. కనీస మద్దతు ధర ప్రకటించినా ఒక్క పంటనూ మద్దతు ధరకు కొనుగోలు చేయలేదని మండిపడ్డారు.
Latest News