|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 12:42 PM
తనపై ఉన్న అవినీతి కేసులను మూసివేయించడానికి సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరించి కేసులు మూసివేయిస్తున్నారంటూ దుయ్యబట్టారు. ‘‘ఆ కేసుల్లో ఫిర్యాదుదారులుగా ఉన్న అధికారులను బెదిరించి, భయపెట్టి వాటిని ఉపసంహరించు కునేలాచేస్తున్నారు. ఆ ఆరోపణలపై నిష్పక్షపాతంగా వ్యహరించాల్సిన దర్యాప్తు అధికారులు కూడా పూర్తిగా కేసుల మూసివేతకు సహకరిస్తున్నారు. తనపై ఉన్న కేసులను ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు అడ్డదారులు తొక్కుతున్నారు.’’ అని బొత్స మండిపడ్డారు.‘‘తద్వారా వ్యవస్థలను కలుషితం చేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారు. దేశంలో ఇంత బరితెగింపునకు దిగిన రాజకీయ నాయకుడ్ని ఎక్కడ చూడం. తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కూడా చట్టం నుంచి ఈ రకంగా తప్పించుకోవడం చంద్రబాబుకి అలవాటే. అదే ఈసారి కూడా కొనసాగుతోంది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుపై గవర్నర్ తక్షణం చర్యలు తీసుకోవాలి. అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి. దర్యాప్తు సంస్థల స్వతంత్రతను కాపాడాలి’’ అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
Latest News