|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 08:36 PM
తీవ్ర తుపాను వరదలతో విలవిలలాడుతున్న శ్రీలంకకు పాకిస్థాన్ పంపుతున్న సహాయక సామగ్రిపై సోషల్ మీడియాలో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అత్యవసరంగా పంపిన రిలీఫ్ మెటీరియల్స్ (సహాయక వస్తువులు) గడువు ముగిసినవని ఓ యూజర్ ఆరోపించడం అంతర్జాతీయ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఇదే నిజమంటూ అతడు ఆధారాలతో సహా చూపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.
ఒక సోషల్ మీడియా యూజర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. శ్రీలంకకు పంపుతున్న రిలీఫ్ మెటీరియల్స్ కాలపరిమితి ముగిసినట్లు తాము గమనించామని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఫొటోను కూడా షేర్ చేశారు. అందులో నిత్యావసర సరుకుల తయారీ తేదీ 2022 కాగా.. 2024 అక్టోబర్ నెలకే ముగిసినట్లు ఉంది. వాటిని రౌండ్ మార్కు చేసి మరీ.. సదరు యూజర్ అందరికీ సులువుగా కనిపించేలా చూపించాడు. అంతేకాకుండా ఆ బస్తాలపై పాకిస్థాన్ తయారు చేసినట్లుగా కూడా ఉంది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ పాకిస్థాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాణాలు కాపాడేందుకు సాయంగా పంపుతున్న ఈ ఆహార పదార్థాలు, ఔషధాలు.. గడువు ముగిసినవి కావడంతో తమ ప్రాణాలకే ప్రమాదం అని వెల్లడిస్తున్నారు. మానవతా సాయం అందించే విషయంలో ఈ రకమైన నిర్లక్ష్యం అమానవీయం అని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ ఆరోపణల విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం లేదా శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం నుంచి ఇంకా ఎటువంటి అధికారిక స్పందన వెలువడలేదు. కానీ ఈ ఘటనపై పాక్ వెంటనే స్పందించాలని నెటిజెన్లు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఈ గడువు ముగిసిన సరుకులు పంపేందుకు ఉపయోగించిన తమ విమానానికి.. భారత్ గగనతలాన్ని నిరాకరించిందంటూ తప్పుడు ప్రచారం చేసింది. దీనిపై స్పందించిన భారత్.. శ్రీలంకకు మానవతా సహాయం అందించాలనే దృక్పథంతోనే పాక్ విమానాలకు అనుమతులు ఇచ్చినట్లు భారత అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు గగనతల అనుమతి కోసం సంప్రదించగా.. సాయంత్రం 4.30 గంటలకే భారత్ అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ సమాచారాన్ని పాకిస్థాన్ అధికారులకు చేరవేసిప్పటికీ తప్పుడు ప్రచారాలు చేశారని వివరించారు.
పంపించేవే గడువు ముగిసిన సరుకులు కాగా.. పాకిస్థాన్ భారత్ పరువు తీయాలని బాగానే ప్రయత్నించింది. కానీ వారు చేసిన తప్పు వెలుగులోకి రావడంతో.. ప్రస్తుతం అంతర్జాతీయ వ్యాప్తంగా దాయాది దేశం పరువు పోతోంది. ముఖ్యంగా మీమర్స్ అయితే ఈ గడువు ముగిసిన సరుకుల సాయంపై విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. మరి పాక్ చేసిన పని చూస్తుంటే మీకేమనిపిస్తుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Latest News