|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 08:34 PM
జననాల రేటు బాగా తగ్గిపోవడంతో.. భవిష్యత్ గురించి చైనా తీవ్ర ఆందోళన చెందుతోంది. గత కొన్నేళ్లుగా.. పెళ్లిళ్లు చేసుకోవాలని, పిల్లలను కనాలని.. తమ పౌరులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే పెళ్లిళ్లు చేసుకున్న వారికి, పిల్లలను కనేవారికి.. భారీగా ప్రోత్సాహకాలు, రాయితీలు, నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు ఇప్పటికే అనేక ప్రకటనలు చేసింది. అయినప్పటికీ చైనా ప్రజలు మాత్రం.. పెళ్లి, పిల్లలు, బాధ్యతలను పక్కన పెట్టి.. కెరీర్, డబ్బు సంపాదనపై దృష్టి సారిస్తున్నారు. గతంలో జనాభా పెరుగుదలతో బాధపడిన చైనా .. బలవంతంగా జనాభా తగ్గించే ప్రయత్నాలు చేసింది. దీంతో ప్రస్తుతం చైనాలో వృద్ధ జనాభా పెరిగిపోయి.. యువ జనాభా తీవ్రంగా తగ్గిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. భవిష్యత్‌లో పనిచేసే వారు లేక దేశం దివాళా తీస్తుందని తీవ్ర ఆందోళన చెందుతోంది.
ఈ నేపథ్యంలోనే.. జనాభా పెంచడమే లక్ష్యంగా చైనా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కండోమ్‌లు, ఇతర గర్భనిరోధక సాధనాలపై భారీగా పన్ను విధించి.. ప్రజలకు అందుబాటులో లేకుండా చూడాలని అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే వీటన్నింటిపై వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)ను 13 శాతం విధించాలని నిర్ణయించింది. జనవరి నుంచి ఈ వ్యాట్ అమల్లోకి వస్తుందని తాజాగా ప్రకటించింది. అయితే.. కండోమ్‌లపై పన్ను విధించడం వల్ల తలెత్తే ఆరోగ్య పరిణామాలపై చైనాలోని ప్రజల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే ఒకప్పుడు భారీ జనాభాతో అవస్థలు పడిన చైనా.. కఠినమైన ఒకే బిడ్డ విధానాన్ని తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే అప్పుడు జననాల నియంత్రణ కోసం.. కండోమ్‌లు సహా గర్భనిరోధక ఉత్పత్తులను పన్ను నుంచి మినహాయింపు కల్పించారు. ఇప్పుడు వరుసగా 3 ఏళ్లుగా జనాభా క్షీణిస్తుండటంతో.. ఈ పన్నును తిరిగి వాటిపై అమలు చేస్తున్నారు. మరోవైపు.. పిల్లల సంరక్షణ సేవలు, వృద్ధుల సంరక్షణ సంస్థలపై ఉన్న పన్నులపై మినహాయింపులు ప్రకటించింది.
అయితే చైనా తీసుకున్న ఈ విధానం జననాల రేటును పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలగా కనిపిస్తున్నప్పటికీ.. దీనివల్ల పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చైనాలో అసురక్షిత లైంగిక సంబంధాల కారణంగా హెచ్ఐవీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు కండోమ్‌లపై పన్నులు విధించడం వల్ల ప్రజారోగ్యానికి మరింత ముప్పు వాటిల్లే అవకాశం ఉందని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చైనాలో ఒకే బిడ్డ విధానాన్ని ఎత్తివేసి.. 10 ఏళ్లు కావస్తున్నప్పటికీ.. చైనాలో జననాల సంఖ్య 2024లో కేవలం 95.4 లక్షలకు పడిపోయింది. అది పదేళ్ల క్రితం నమోదైన సంఖ్యలో సగం మాత్రమేనని అక్కడి వర్గాలు చెబుతున్నాయి. జననాల రేటును పెంచడానికి చైనా ప్రయత్నిస్తున్నప్పటికీ.. అధిక ఖర్చు అనేది ఒక పెద్ద అడ్డంకిగా మారింది.
2024 నివేదిక ప్రకారం.. పిల్లలను పెంచడానికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దేశాల్లో చైనా మొదటి వరుసలో ఉంది. చైనాలో 18 ఏళ్లు వచ్చే వరకు ఒక బిడ్డను పెంచడానికి సుమారు 5.38 లక్షల యువాన్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.69 లక్షలు ఖర్చవుతుంది. ఆర్థిక మందగమనం, స్థిరమైన ఉద్యోగాలు లేని కారణంగా చైనా యువత పిల్లలను కనడానికి ఇష్టపడటం లేదు.
Latest News