|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 11:56 AM
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు క్రికెట్ అభిమానులకు వరుస దెబ్బలు తగిలాయి. తాజాగా, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రాబోవు మినీ వేలం కోసం రిజిస్టర్ చేసుకోలేదని సమాచారం అందుతోంది. దీంతో ఆయన వచ్చే సీజన్‌లో ఐపీఎల్ ఆడే అవకాశం దాదాపు కనుమరుగైనట్లు కనిపిస్తోంది. ఈ విషయం లీగ్‌లో హై-వోల్టేజ్ ప్లేయర్ల లిస్ట్‌ను మరింత కుదించేసింది.
గత రెండు సీజన్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడిన మ్యాక్స్‌వెల్‌ను జట్టు రిటైన్ చేసుకోలేదు. పంజాబ్ కింగ్స్ కూడా ఆయనను వదులుకుంది. ఇప్పుడు మినీ వేలం నుంచి తప్పుకోవడంతో మ్యాక్సీ ఐపీఎల్ కెరీర్‌పై పెద్ద ప్రశ్నార్థకం ఏర్పడింది. గత కొన్నేళ్లుగా వరుస గాయాలు, ఫామ్ డౌన్‌తో ఇప్పటికే ఆయన ఆట తీరు విమర్శలు ఎదుర్కొంటోంది.
ఇది ఒక్క మ్యాక్స్‌వెల్ కథ మాత్రమే కాదు, ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్లు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. ఇటీవలే దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ లిస్ట్‌లో మ్యాక్స్‌వెల్ పేరు కూడా చేరనున్నట్లు స్పష్టమవుతోంది.
ఐపీఎల్ అనే గ్లామర్ లీగ్ నుంచి ఒక్కసారిగా ఇంతమంది మ్యాచ్-విన్నర్లు దూరమవడం ఫ్రాంఛైజీలకే కాదు, అభిమానులకూ భారీ నిరాశ కలిగిస్తోంది. 2026 మెగా వేలం వరకు మ్యాక్స్‌వెల్ విరామం తీసుకుంటారా లేక పూర్తిగా ఐపీఎల్‌కు గుడ్‌బై చెబుతారా అనేది రాబోవు రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.