|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 09:05 PM
ఇజ్రాయెల్ రాజకీయాల్లో అత్యంత సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తనపై గత ఐదేళ్లుగా కొనసాగుతున్న అవినీతి కేసుల విచారణకు ముగింపు పలకాలని కోరుతూ దేశాధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌కు అధికారికంగా క్షమాభిక్ష కోసం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రత్యేకంగా లేఖ రాశారు. మూడు వేర్వేరు కేసుల్లో మోసం, లంచం, నమ్మకద్రోహం వంటి తీవ్ర అభియోగాలను ఎదుర్కొంటున్న నెతన్యాహు,..ఈ లేఖ ద్వారా దేశ అధ్యక్షుడు జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ అభ్యర్థన ఇజ్రాయెల్ రాజకీయ, న్యాయ వ్యవస్థల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
విచారణ వివరాలు, ప్రధాని ఆవేదన
నెతన్యాహుపై 2018 నుంచే ఈ అవినీతి అభియోగాలు మొదలయ్యాయి. గత ఐదేళ్లుగా సాగుతున్న ఈ న్యాయ పోరాటం వల్ల పాలనా వ్యవహారాలపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వీడియో సందేశం ద్వారా ఈ అంశాన్ని ప్రజలకు చేరవేసిన నెతన్యాహు.. "వారానికి మూడు సార్లు" తాను న్యాయస్థానానికి తప్పనిసరిగా హాజరు కావాల్సి వస్తుందని తెలిపారు. దీనివల్ల దేశానికి పూర్తిస్థాయిలో నాయకత్వం వహించడం, అత్యవసర జాతీయ సమస్యలపై దృష్టి సారించడం కష్టమవుతోందని పేర్కొన్నారు. తనపై సాగుతున్న ఈ సుదీర్ఘ విచారణ ఇజ్రాయెల్‌ను విభజిస్తోందని.. దేశం చీలిపోవడానికి అనుమతించకూడదని నెతన్యాహు విజ్ఞప్తి చేశారు.
అసలీ కేసులు ఏమిటంటే?
మీడియా సంస్థలతో కుదిరిన డీల్స్‌లో నెతన్యాహు అనుచిత ప్రయోజనాలు పొందినట్లు అభియోగాలు ఉన్నాయి. అలాగే అధికార దుర్వినియోగం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వ వనరులను వాడుకోవడం వంటివి కూడా చేశాడని ఆరోపిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండాసంపన్న మిత్రుల నుంచి భారీ సిగార్లు, షాంపైన్లు వంటి బహుమతులు తీసుకున్నట్లు కూడా అభియోగాలు మోపారు.
ట్రంప్ సూచనతో లేఖ..
ఈ క్షమాభిక్ష విజ్ఞప్తికి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక కారణంగా నిలిచారు. ఇటీవల ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చిన ట్రంప్ ఒక బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తమ మిత్రుడైన నెతన్యాహుకు క్షమాభిక్ష ఇవ్వాలని అధ్యక్షుడు హెర్జోగ్‌ను కోరారు. ఆ సమయంలో అధ్యక్షుడు హెర్జోగ్ స్పందిస్తూ.. క్షమాభిక్ష కావాలనుకునేవారు తనకు అధికారికంగా లేఖ పంపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. హెర్జోగ్ ఇచ్చిన ఈ సూచన తర్వాతే నెతన్యాహు ఈ లేఖ రాశారు. అధ్యక్షుడిగా హెర్జోగ్‌కు క్షమాభిక్ష ప్రసాదించే రాజ్యాంగ అధికారం ఉన్నప్పటికీ.. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ఇజ్రాయెల్ అంతర్గత రాజకీయాలపై భారీ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
Latest News