|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 07:52 PM
పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ8 నిందితుడిగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి సోమవారం పల్నాడులోని స్థానిక కోర్టులో లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.సోమవారం మధ్యాహ్నం ఒంటరిగా కోర్టుకు వచ్చిన వెంకట్రామిరెడ్డి, న్యాయమూర్తి ఎదుట లొంగిపోతున్నట్లు తెలిపారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూనే, దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. దీంతో, ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.ఈ జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు ఏ8, ఏ9 నిందితులుగా ఉన్నారు. గతంలో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందగా, దానిని పోలీసులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం రెండు రోజుల క్రితం వారి బెయిల్‌ను రద్దు చేసింది. రెండు వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోయి, విచారణకు సహకరించాలని ఆదేశించింది.వెంకట్రామిరెడ్డి లొంగిపోయినప్పటికీ, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా లొంగిపోలేదు. సుప్రీంకోర్టు విధించిన గడువు ఇంకా ఉండటంతో ఆయన హైదరాబాద్ లేదా బెంగళూరులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ ఏడాది మే నెలలో వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీకి చెందిన ఇద్దరు సోదరులు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 10 మందిపై కేసు నమోదు కాగా, పిన్నెల్లి సోదరులు కూడా నిందితులుగా ఉన్నారు. వెంకట్రామిరెడ్డి లొంగుబాటుతో కేసు దర్యాప్తు వేగవంతం కానుంది.
Latest News