|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 07:38 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సహకారంతో పలు ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే మూడేళ్లుగా ముందుకు సాగని కడప - రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణ పనుల్లోనూ కదలిక వచ్చింది. ఈ జాతీయ రహదారిని శేషాచలం అటవీ ప్రాంతం మీదుగా నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుమతులలో జాప్యం కారణంగా పనులలో ఆలస్యం జరుగుతూ వచ్చింది. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం.. కేంద్రం సహకారంతో పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి. దీంతో కడప రేణిగుంట జాతీయ రహదారి పనులు ప్రారంభమయ్యాయి.
మరోవైపు కడప రేణిగుంట జాతీయ రహదారి పనులను ప్యాకేజీల వారీగా చేపడుతున్నారు. మొదటి ప్యాకేజీ పనుల కింద రాజంపేట నుంచి కడప వరకు రహదారి నిర్మిస్తున్నారు. ఇందుకోసం కొంత భూమిని కూడా సేకరించడం జరిగింది. కూచివారిపల్లి- కడప వైపున సేకరించిన భూమిలో పిచ్చిమొక్కలు, కంపచెట్లు పెరిగాయి. దీంతో గతం రెండు మూడు రోజుల నుంచి అధికారులు వాటిని తొలగిస్తున్నారు. మరోవైపు గ్రామాలు, పట్టణాలలో భవనాలు తొలగించడం, వారికి నష్టపరిహారం చెల్లించడం వంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో కడప రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను పూర్తిగా అటవీ భూములకు సమీపంగానే ఉండేలా అధికారులు ప్లాన్ చేశారు. ఎక్కడైనా భూమి అవసరమైతే.. రైతుల నుంచి సేకరించి వారికి పరిహారం అందించారు.
అయితే అటవీ భూములు కావడం.. వన్యప్రాణులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉండటంతో అటవీ శాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రస్తుతం పర్యావరణ అనుమతులు కూడా లభించడంతో అధికారులు పనులు ప్రారంభించారు. మరోవైపు వన్యప్రాణుల సంచారం కోసం భారీ వంతెనలు ఏర్పాటు చేయనున్నారు. నాలుగు ప్రదేశాల్లో భారీ వంతెనలు ఏర్పాటు చేయటం ద్వారా వన్యప్రాణులు హైవే మీదకు వచ్చే అవకాశం లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మరోవైపు కడప రేణిగుంట జాతీయ రహదారిని 122 కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్నారు. ఇందుకోసం 3 వేల కోట్ల వరకూ ఖర్చుచేస్తున్నారు. కడప రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి అందుబాటులోకి వస్తే కడప నుంచి తిరుపతికి ప్రయాణ సమయం గంటన్నర వరకూ తగ్గుతుందని అంచనా.
Latest News