|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 02:22 PM
రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని వైయస్ఆర్‌సీపీ ఆవేదన వ్యక్తం చేసింది. రైతుల సమస్యల పరిష్కారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం కేంద్రం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. వైయస్ఆర్‌సీపీ లోక్‌సభ సభ్యులు మిథున్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాశ్ చంద్రబోస్ ఈ సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని సమస్యలను కేంద్రం దృష్టికి తెచ్చారు. ‘పలు సమస్యలపై మాట్లాడేందుకు సభలో సమయం ఇవ్వాలి. మేము లేవనెత్తిన ప్రతి ఒక్క అంశంపై కేంద్రం పరిష్కారాన్ని చూపాలి. జాతీయ స్థాయిలో 2023–24లో కోటి 84 టన్నుల మత్స్య ఉత్పత్తుల దిగుబడులు నమోదయ్యాయి. ఇందులో 51.58 లక్షల టన్నుల ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో ఉత్పత్తయ్యే రొయ్యల్లో 76 శాతం, చేపల్లో 28 శాతం వాటా ఏపీదే. వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల ఆదాయ నిష్పత్తిలో 9.15 శాతం ఆక్వా రంగం నుంచే వస్తోంది. ట్రంప్ విధించిన టారిఫ్‌ల కారణంగా రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. వీరిని ఆదుకునేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలి’ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Latest News