|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 02:10 PM
అన్నదాతల ఇక్కట్లతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అన్ని ప్రధాన సమస్యలను పార్లమెంటు ఉభయ సభల్లో బలంగా లేవనెత్తి.. ప్రజల గొంతుకను గట్టిగా వినిపించాలని పార్టీ ఎంపీలను వైయస్ఆర్‌సీపీఅధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఒకవైపు తుపానుతో తీవ్ర నష్టం, మరోవైపు ఏ పంటకూ కనీస మద్దతు ధర దక్కక కుదేలైన వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. ఈ అంశాలన్నింటినీ పార్లమెంటు సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావించాలని సూచించారు. మోంథా తుపాను వల్ల తీర ప్రాంత జిల్లాల్లో లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం పరిహారం అందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మరోవైపు ఏ పంటకూ కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) లేకపోవడం వారిని మరింత కష్టాల పాల్జేస్తోందన్నారు. వైయస్ఆర్‌సీపీహయాంలో ఆర్బీకేల ద్వారా నేరుగా ధాన్యాన్ని సేకరించడం వల్ల ప్రతి పంటకూ కనీస మద్దతు ధర కచ్చితంగా దక్కేదని గుర్తుచేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వాటన్నింటికి మంగళం పాడి రైతులను గాలికి వదిలేయడంతో దళారులు, వ్యాపారుల చేతిలో దోపిడీకి గురవుతున్నారని మండిపడ్డారు.వరి, మొక్కజొన్న, మినుములు, పత్తి, కంది, అరటి, మిర్చితోపాటు మామిడి లాంటి ప్రధాన పంటలకు ఎమ్మెస్పీ లభించక రైతులు అల్లాడుతున్న దృష్ట్యా కేంద్రం వెంటనే అత్యవసర నిధులు విడుదల చేసి కనీస మద్దతు ధర దక్కేలా ఎంపీలు ఒత్తిడి తేవాలని సూచించారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం పక్కాగా అమలు చేసిన ఉచిత పంటల బీమాకు కూటమి ప్రభుత్వం మంగళం పాడడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Latest News