|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 07:14 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిత్వా తుఫాను ముప్పుపొంచి ఉంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరం మధ్యన తుఫాను కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాను ప్రస్తుతం ఉత్తర వాయవ్వ దిశగా కదులుతోంది. మరికొన్ని గంటల్లో దిత్వా తుఫాను తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తు్న్నారు. దిత్వా తుఫాను ఆదివారం రోజున దక్షిణ కోస్తాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తా జిల్లాలు అయిన శ్రీపొట్టి శ్రీరాములునెల్లూరు జిల్లా, చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాలో అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేశారు.
మరోవైపు తుఫాను ప్రభావంతో డిసెంబర్ 1వ తేదీ (సోమవారం) దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే మధ్య కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురవటంతో పాటుగా తీరం వెంబడి.. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు దిత్వా తుఫాను ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ఇక అత్యవసర సహాయం కోసం వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాలకు ఇప్పటికే 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తరలించారు. అలాగే వెంకటగిరిలో 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించారు.
దిత్వా తుఫాను ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపై అధికంగా ఉండొచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నడుమ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తుఫాను సమయంలో విద్యుత్ సమస్యలు రాకుండా అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు.
మరోవైపు దిత్వా తుఫాను నేపథ్యంలో సోమవారం రోజున తిరుపతి జిల్లాల్లో పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తుఫాను కారణంగా సోమవారం రోజున తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నడుమ.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రోజున తిరుపతి జిల్లాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. మరోవైపు అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లోనూ సోమవారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
Latest News