|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 01:41 PM
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో ఒక వ్యక్తి సూటు, బూటు వేసుకుని వచ్చి బంగారం దుకాణంలో కొనుగోలు పేరుతో బంగారు గొలుసులు దొంగతనం చేశాడు. ఈ ఘటన బదౌన్‌లోని ఒక బంగారం దుకాణంలో చోటుచేసుకుంది. ఖరీదైన దుస్తులతో బంగారం దుకాణంలోకి వచ్చి చోరీ చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.నిన్న ఉదయం 11.30 గంటల సమయంలో సదర్ కొత్వాలి ప్రాంతంలోని హల్వాయి చౌక్‌లో ఉన్న జుగల్ కిషోర్ ప్రహ్లాది లాల్ జ్యువెలర్స్ దుకాణంలోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. నలుపురంగు జీన్స్, నలుపు రంగు కోటు, బూట్లు వేసుకున్న అతడు బంగారు గొలుసులు చూపించమని దుకాణంలోని యజమానిని అడిగాడు.యజమాని, సిబ్బంది పలు రకాల డిజైన్ బంగారు గొలుసులను అతడికి చూపించారు. అతను బంగారు గొలుసుల గురించి సిబ్బందిని అడుగుతున్న సమయంలోనే మరికొంతమంది ఆ దుకాణంలోకి వచ్చారు. దుకాణ యజమాని, సిబ్బంది దృష్టి ఇతరుల వైపు ఉండటాన్ని గమనించిన సదరు వ్యక్తి బాక్సులోని మూడు బంగారు గొలుసులను తీసుకుని, పక్కనే కూర్చున్న మహిళను తోసుకుని వేగంగా బయటకు పరుగు పెట్టాడు.అవాక్కైన యజమాని, సిబ్బంది అతనిని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ దొరకలేదు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Latest News