|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 10:30 PM
సాధారణంగా క్యాలెండర్‌లో నెల మారిందంటే.. ఎన్నో కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తుంటాయి. ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి.. చాలా మార్పులు వస్తుంటాయి. కొన్నింటి డెడ్‌లైన్స్ ముగుస్తుంటాయి. ఎక్కువగా బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఉంటాయని చెప్పొచ్చు. ఇప్పుడు డిసెంబర్ నెలలో ఏమేం మారనున్నాయో.. ఈ నెలతో ఏం గడువులు ముగియనున్నాయో తెలుసుకుందాం. కొన్ని మార్పులు.. మీ జేబుకు చిల్లుపడేసేవి కూడా ఉండొచ్చు. సాధారణంగానే.. ఒకటో తేదీ వచ్చిందంటే గ్యాస్ ధరలు మారుతుంటాయి. ఇది గుర్తుంచుకోవాలి. ఇంకా ముఖ్యమైన నిర్ణయాల్లో.. పాన్ కార్డు హోల్డర్లు, పెన్షనర్లు, టాక్స్ పేయర్లకు సంబంధించినవి కూడా ఉన్నాయి. ఎస్బీఐ ఎం-క్యాష్ సర్వీసుల్ని నిలిపివేస్తుంది. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు గడువు ముగుస్తుంది. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
>> ఎస్బీఐ ఎం- క్యాష్ సర్వీస్- 2025, నవంబర్ 30 నుంచి ఎస్బీఐ ఎం క్యాష్ సర్వీస్ ఉండదు. అంటే దీని ద్వారా డబ్బు పంపడం, క్లెయిమ్ చేసుకోవడం కుదరదు. ఆన్‌లైన్‌ఎస్బీఐ, యోనో లైట్ ద్వారా ఎం క్యాష్ సేవల్ని వాడుకోలేరన్నమాట. దీనికి ప్రత్యామ్నాయంగా యూపీఐ, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, నెఫ్ట్ వంటి మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
లైఫ్ సర్టిఫికెట్ (జీవన్ ప్రమాణ్ పత్ర)- ప్రభుత్వ పెన్షనర్లు.. ఎలాంటి అంతరాయాలు లేకుండా పెన్షన్ అందుకునేందుకు లైఫ్ సర్టిఫికెట్ లేదా జీవన్ ప్రమాణ్ పత్ర సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు డెడ్‌లైన్ 2025, నవంబర్ 30. ఇది బయోమెట్రిక్ ఎనేబుల్డ్ ఆధార్ బేస్డ్ డిజిటల్ సర్టిఫికెట్.
>> నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీంకు (UPS) మారేందుకు 2025, నవంబర్ 30 డెడ్‌లైన్‌గా ఉంది. డిసెంబర్ నుంచి మారేందుకు కుదరదు. అందుకే మారాలనుకునే NPS సబ్‌స్క్రైబర్లు.. ఆన్‌లైన్‌లో CRA సిస్టమ్ ద్వారా నోడల్ ఆఫీసులో భౌతికంగా దరఖాస్తు సమర్పించడం ద్వారా కూడా మారేందుకు ఛాన్స్ ఉంటుంది.
ఐటీఆర్ డెడ్‌లైన్- ఆడిట్ అవసరం లేని టాక్స్‌పేయర్లు ఐటీ రిటర్న్స్ గడువు సెప్టెంబర్ 16తోనే ముగిసింది. ఇప్పుడు ఆడిట్ అవసరం ఉన్న టాక్స్ పేయర్లకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు డిసెంబర్ 10 వరకు గడువు ఉంది. ఆ తేదీ దాటితే పెనాల్టీ పడే అవకాశం ఉంటుంది.
బిలేటెడ్ ఐటీ రిటర్న్స్- వాస్తవ గడువు ముగిసిన వారు.. బిలేటెడ్ ఐటీఆర్ దాఖలు చేసేందుకు డిసెంబర్ 31 వరకు గడువు ఉంది. ఇక్కడ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
పాన్- ఆధార్ లింక్- 2024 అక్టోబర్ 1కి ముందు.. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని ఉపయోగించి పాన్ కార్డును పొందిన వారు.. పాన్ కార్డును కచ్చితంగా ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. ఇందుకు డిసెంబర్ 31 గడువు. తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Latest News