|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 08:22 PM
యూకేలోని ప్రముఖ ఆక్స్‌ఫర్డ్ యూనియన్‌లో జరగాల్సిన చర్చ నుంచి భారత అధికారులు చివరి నిమిషంలో వెనుదిరిగారంటూ పాకిస్థాన్ చేసిన తప్పుడు ప్రచారాన్ని భారత్ దీటుగా తిప్పికొట్టింది. అసలు వాస్తవాలను భారత సీనియర్ న్యాయవాది సాయి దీపక్ వెల్లడించడంతో.. చర్చలో పాల్గొనకుండా వెనుదిరిగింది పాకిస్థాన్ బృందమేనని స్పష్టం అయింది. భారత్-పాక్ అధికారుల మధ్య గురువారం నాడు ఈ చర్చ జరగాల్సి ఉండగా.. భారత్ తరఫున మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవాణే, సుబ్రమణియన్ స్వామి, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌లు మొదట పాల్గొనాల్సి ఉంది. అలాగే పాకిస్థాన్ నుంచి ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ సహా పలువురు ప్రముఖులు హాజరుకావాల్సి ఉంది.
అసలేం జరిగిందంటే..?
కానీ భారత్ బృందం చివరి నిమిషంలో వైదొలగాలని నిర్ణయించుకుందని యూనియన్ నిర్వాహకులు చెప్పారంటూ యూకేలోని పాక్ రాయబార కార్యాలయం తప్పుడు ప్రచారానికి తెరలేపింది. పాక్ బృందం లండన్‌లోనే సమావేశానికి సిద్ధంగా ఉన్నా.. భారత్ పాల్గొనడం లేదని ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది. అితే పాక్ అబద్ధపు ప్రచారాన్ని సీనియర్ న్యాయవాది సాయి దీపక్ బలంగా తిప్పికొట్టారు. స్వామి, నరవాణే కొన్ని కారణాల వల్ల యూకేకు రాలేకపోవడంతో.. తాను ప్రత్యామ్నాయ బృందాన్ని ఏర్పాటు చేసుకొని చర్చకు సిద్ధంగా యూకేకు వెళ్లినట్లు దీపక్ తెలిపారు.
అయితే చర్చకు కేవలం కొన్ని గంటల ముందు యూనియన్ అధికారులు తనకు కాల్ చేసి.. పాక్ తరఫున హాజరు అవ్వాల్సిన బృందం అసలు యూకేకు రాలేదని వెల్లడించారని అన్నారు. దీంతో చర్చ రద్దు కావడం తనకు ఆగ్రహం తెప్పించిందని తెలిపారు. తమను ఎదుర్కోలేకనే పాక్ బృందం చర్చకు భయపడి వెనుదిరిగిందని వివరించారు.
చిన్న పిల్లల వెనుక దాక్కొని..
ఇది "పిల్లల వెనక దాక్కున్నట్లుగా" ఉందని సాయి దీపక్ తీవ్రంగా ఎద్దేవా చేశారు. పాక్ బృందం ఇప్పటికీ ఆక్స్‌ఫర్డ్‌లోనే ఉంటే.. తమతో చర్చకు రావాలని ఆయన బహిరంగ సవాల్ విసిరారు. దీంతో పాకిస్థాన్ చేసిన ఆరోపణలు అవాస్తవాలు అని స్పష్టం అయింది. కానీ దీనిపై అటు యూకే కానీ ఇటు పాక్ కానీ స్పందించలేదు.
Latest News