|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 05:26 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని కోసం రెండో విడత భూసేకరణ చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ, ఇది రియల్ ఎస్టేట్ మాఫియాను తలపిస్తోందని ఆరోపించారు. "మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె కావాలా?" అన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందని ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు.తొలి విడతలో సేకరించిన 54 వేల ఎకరాల్లో ప్రపంచ స్థాయి నగరం ఎక్కడ నిర్మించారని షర్మిల ప్రశ్నించారు. రైతుల నుంచి తీసుకున్న 34 వేల ఎకరాల్లో ఒక్క కిలోమీటర్ నిర్మాణం కూడా జరగలేదని, ఐకానిక్ భవనాల ఊసే లేదని విమర్శించారు. అలాంటిది ఇప్పుడు కొత్తగా మరో 16 వేల ఎకరాలు ఎందుకని నిలదీశారు. అదానీ, అంబానీలకు బాకీ పడ్డారని భూములు సేకరిస్తున్నారా అని సూటిగా ప్రశ్నించారు.దేశంలోని అతిపెద్ద విమానాశ్రయాలు, అంతర్జాతీయ క్రీడా నగరాలతో పోలుస్తూ అమరావతికి వేల ఎకరాలు ఎందుకని షర్మిల అనుమానం వ్యక్తం చేశారు. ముంబై విమానాశ్రయానికి 1850 ఎకరాలు, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 2200 ఎకరాలు సరిపోయినప్పుడు, అమరావతికి 5 వేల ఎకరాలు అవసరమా అని అడిగారు. బీజింగ్, లండన్ ఒలింపిక్స్ స్పోర్ట్స్ సిటీలు 150 ఎకరాల్లోనే ఉండగా, ఇక్కడ 2500 ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు.రాజధాని భూములపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అనుమానాలను నివృత్తి చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. రెండో విడత భూసేకరణను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.
Latest News