|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 04:52 PM
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ (81) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, నిన్న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తుదిశ్వాస విడిచారు. నగరంలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉంటున్న ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి, ఆ తర్వాత రీజెన్సీ ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.1944 సెప్టెంబర్ 25న కాన్పూర్‌లో జన్మించిన జైస్వాల్, తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో సొంత నగరంతో విడదీయరాని బంధాన్ని కొనసాగించారు. 1989లో కాన్పూర్ మేయర్‌గా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాన్పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై 1999, 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలుపొందారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వంలో కీలకమైన బొగ్గు శాఖతో పాటు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.
Latest News