|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 11:43 PM
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. హెడింగ్లే వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండు సెంచరీలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ నమోదు చేసిన ఈ 27 ఏళ్ల లెఫ్ట్ హ్యాండర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే రిపీట్ చేశాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసి 130 బంతుల్లోనే మూడంకెల మార్కు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే పలు రికార్డులను బద్దలు కొట్టాడు.
తొలి ఆసియన్ వికెట్ కీపర్‌గా..
లీడ్స్ టెస్టులో రెండు సెంచరీలు చేయడం ద్వారా ఇలా ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేసిన తొలి ఆసియన్ వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ నిలిచాడు. ఇప్పటివరకు ఆసియాకు చెందిన ఒక్క బ్యాటర్ కూడా ఈ ఫీట్ సాధించకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఇంగ్లాండ్‌లో ఈ ఫీట్ సాధించిన తొలి భారత క్రికెటర్‌గానూ రిషభ్ పంత్ నిలిచాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో ఏ భారతీయ బ్యాటర్ సెంచరీ సాధించలేకపోయాడు.
ఓవరాల్‌గా ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేసిన రెండో వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. పంత్ కంటే ముందు జింబాబ్వేకు చెందిన ఆండీ ఫ్లవర్ 2001లో దక్షిణాఫ్రికాపై ఈ ఫీట్ సాధించాడు. హరారేలో అతడు తొలి ఇన్నింగ్స్‌లో 142 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 199 పరుగులు చేశాడు. పంత్ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు.
భారత్ తరఫున ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేసిన ప్లేయర్లు..
విజయ్ హజారే
సునీల్ గవాస్కర్ (3 సార్లు)
రాహుల్ ద్రవిడ్ (2 సార్లు)
విరాట్ కోహ్లీ
అజింక్య రహానే
రోహిత్ శర్మ
రిషభ్ పంత్
మొత్తంగా రిషభ్ పంత్ తన కెరీర్‌లో 8 టెస్టు సెంచరీలు సాధించాడు. అందులో సగం అంటే నాలుగు సెంచరీలు ఇంగ్లాండ్ గడ్డపైనే కొట్టాడు. మరో రెండు సెంచరీలు ఇండియాలో చేశాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల్లో ఒక్కోసారి టెస్టు సెంచరీ నమోదు చేశాడు. టీమిండియా తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ప్లేయర్‌గానూ పంత్ ఉన్నాడు. ఈ టెస్టులో చేసిన తొలి సెంచరీతోనే అతడు ఎంఎస్ ధోనీ (6 సెంచరీలు)ను బీట్ చేశాడు.