|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 05:48 PM
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. సెల్ ఫోన్ దొంగింలించిందనే అనుమానం, జ్యోతిష్యుడి మాటలు నమ్మి పదేళ్ల బాలికను చిత్రహింసలకు గురిచేశారు. ఈ అమానుష ఘటన ఇందుకూరుపేట మండలం, కుడితిపాళెం గ్రామం కాకర్లదిబ్బలో వెలుగుచూసింది.పోలీసుల వివరాల ప్రకారం.. తల్లిదండ్రులు లేని పదేళ్ల బాలికను ఆమె మేనత్త మాణికల మన్నారి చేరదీసి పెంచుతోంది. ఇటీవల మన్నారి పొరిగింట్లో నివసించే నాగరాజు అనే వ్యక్తి సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. దీంతో ఆయన ఓ జ్యోతిష్యుడిని సంప్రదించగా, ఆ పక్కింట్లో ఉండే బాలికే ఫోన్ దొంగిలించిందని చెప్పాడు.జ్యోతిష్యుడి మాటలు నమ్మిన నాగరాజు, అతని భార్య సుబ్బమ్మ, చుట్టుపక్కల వారైన శ్రీనివాసులు, సార్ముడమ్మ, బాలిక మేనత్త మన్నారి కలిసి బాలికను నిలదీశారు. ఫోన్ ఎక్కడ దాచిందో చెప్పాలంటూ బెదిరించారు. తనకు ఏమీ తెలియదని బాలిక ఎంత చెప్పినా వినకుండా, పొయ్యి దగ్గరకు లాక్కెళ్లి అట్లకాడ కాల్చి బాలిక మూతి, నాలుక, చేతులపై కిరాతకంగా వాతలు పెట్టారు.ఆదివారం ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే 112 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై నాగార్జునరెడ్డి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా గాయపడిన బాలికను వైద్య సహాయం కోసం ఆసుపత్రికి తరలించారు.
Latest News