|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 04:39 PM
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తాజాగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. 2003లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఐసీసీ ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు నుంచి సీనియర్ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను తప్పించడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తర్వాత లక్ష్మణ్ తనతో మూడు నెలల పాటు మాట్లాడలేదని గంగూలీ ఇప్పుడు గుర్తుచేసుకున్నాడు. పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలను పంచుకున్నాడు.2003 ప్రపంచకప్‌కు ముందు లక్ష్మణ్ టెస్టులతో పాటు వన్డేల్లోనూ భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. దీంతో ప్రపంచకప్ జట్టులో ఆయన స్థానం ఖాయమని అందరూ భావించారు. అయితే, అనూహ్యంగా అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దినేశ్ మోంగియా వైపు మొగ్గుచూపాడు. మోంగియాను జట్టులోకి తీసుకోవాలని గంగూలీ పట్టుబట్టడంతో లక్ష్మణ్‌కు నిరాశ ఎదురైంది.ఈ నిర్ణయం గురించి గంగూలీ మాట్లాడుతూ... "ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చినప్పుడు లేదా జట్టు నుంచి తప్పించినప్పుడు వారు అసంతృప్తికి గురవ్వడం సహజం. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నమెంట్ జట్టులో చోటు దక్కకపోతే ఎవరైనా బాధపడతారు. లక్ష్మణ్ లాంటి మేటి ఆటగాడు అలా నిరాశ చెందడంలో ఆశ్చర్యం లేదు. ఆ నిర్ణయం తర్వాత అతను నాతో దాదాపు మూడు నెలలు మాట్లాడలేదు. తర్వాత నేనే చొరవ తీసుకుని అతనితో మాట్లాడాను. పరిస్థితిని చక్కదిద్దాను" అని దాదా తెలిపాడు.అయితే, లక్ష్మణ్‌ను తప్పించడం వ్యక్తిగత నిర్ణయం కాదని గంగూలీ స్పష్టం చేశాడు. "ప్రపంచకప్ ముగిసి, మేము మంచి ప్రదర్శన చేసి ఫైనల్ వరకు వెళ్లినందుకు అతను సంతోషించాడు. మేము తిరిగి వచ్చిన తర్వాత లక్ష్మణ్ మళ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు. పాకిస్థాన్, ఆస్ట్రేలియా పర్యటనలలో అద్భుతంగా ఆడాడు. పాకిస్థాన్‌లో మేము మొదటిసారి సిరీస్ గెలవడంలో వీవీఎస్ పాత్ర ఎంతో కీలకం. అది ఏమాత్రం వ్యక్తిగత నిర్ణయం కాదని వారికి కూడా తెలుసు" అని గంగూలీ వివరించాడు.
Latest News