తిరుమలకు వెళ్లి తిరిగొస్తుండగా.. ఘోర రోడ్డు ప్రమాదం
 

by Suryaa Desk | Sun, Jun 22, 2025, 07:49 PM

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చంద్రగిరి మండలం తూర్పుపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులు చనిపోయారు. వారి ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. రామాపురం గ్రామంలో ఉండే సిద్ధయ్య తన భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు గిరి, గాయత్రితో కలిసి కారులో తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళ్తున్నారు. ఈ సమయంలోనే వారు ప్రయాణిస్తున్న కారు.. తూర్పుపల్లి వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి.. డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు ఎగసిపడ్డాయి. కారులో ఉన్న సిద్ధయ్య కుటుంబం మంటల్లో చిక్కుకుంది.


ఈ ప్రమాదంలో సిద్ధయ్య, అతని భార్య జ్యోతి అక్కడికక్కడే చనిపోయారు. గిరి, గాయత్రిలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మరోవైపు సిద్ధయ్య పుట్టినరోజు కావటంతో కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు వచ్చినట్లు తెలిసింది. తిరుమల శ్రీవారి దర్శనం పూర్తి చేసుకున్న అనంతరం కుటుంబం మొత్తం కారులో తిరుగు ప్రయాణం కాగా.. ఇంతలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనలో అమ్మానాన్నలు ఇద్దరు చనిపోగా.. ఇద్దరు పిల్లలు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


మరోవైపు సత్యవేడు మండలంలో అగ్నిప్రమాదం జరిగింది. పాలగుంటలోని స్పెర్రీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 25 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని యజమాని చెప్తున్నారు. ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో 60 మంది వరకూ కార్మికులు ఉన్నారు. అయితే మంటలు చెలరేగగానే.. ఉద్యోగులు, కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. సుమారు రెండు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం వల్లనే ప్రమాదం జరిగిందని అధికారులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Latest News
Mangaluru blast case conviction: Karnataka BJP chief demands apology from Cong leaders Tue, Apr 28, 2026, 02:21 PM
Share of females in India's labour force jumped from 23.3 pc to 40 pc in 7 years: Mandaviya Tue, Apr 28, 2026, 02:15 PM
Tejashwi criticises BJP after Bihar youth shot dead, another injured in New Delhi Tue, Apr 28, 2026, 02:14 PM
'There's a genuine fear among batters': Steyn on pacers dominating IPL 2026 Tue, Apr 28, 2026, 02:01 PM
UNGA chief Annalena Baerbock pays homage to Mahatma Gandhi at Rajghat Tue, Apr 28, 2026, 01:59 PM