|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 07:47 PM
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే శనివారం ఉదయం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనకు గుండెలో నొప్పిగా ఉందని పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ముందుగా విజయవాడ జైలులో ఉన్న డాక్టర్లతో పరీక్షలు చేయించారు.
ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. శనివారం సాయంత్రం వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు.
మరోవైపు ఈ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో అధికారులు శుక్రవారం కస్టడీ పిటిషన్ వేశారు. విచారణలో భాగంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరుఫు న్యాయవాదులు కూడా పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ల మీద సోమవారం (జూన్23) విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. మద్యం కుంభకోణం కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జులై 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
చెవిరెడ్డి అరెస్ట్.. అలిపిరి వద్ద మొక్కులు
మరోవైపు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ వైసిపీ నాయకులు, కార్యకర్తలు అలిపిరి వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. అలిపిరి మెట్ల వద్ద 1016 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని.. కూటమి ప్రభుత్వం ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. పాపం, పుణ్యం అంతా వేంకటేశ్వర స్వామికి తెలుసని.. స్వామి అనుగ్రహంతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెయిల్ మీద విడుదల అవుతారని అభిప్రాయపడుతున్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు.