|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 07:42 PM
పూరి జగన్నాథుడి రథయాత్ర.. ప్రతి భారతీయుడు ఒక్కసారైనా కనులారా చూసి తరించాలనుకునే సందర్భం. ఈ అపురూప ఘట్టాన్ని చూసేందుకు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది కూడా పూరి జగన్నాథుడి రథయాత్రకు సర్వం సిద్ధమైంది. జూన్ 27వ తేదీ పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురు భక్తులు పూరి జగన్నాథుడి రథయాత్రను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే అలాంటి భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ వినిపించింది. పూరి జగన్నాథ్ రథయాత్రకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. అయితే రాజమహేంద్రవరం డిపో అధికారులు వీటిని ఏర్పాటు చేశారు.
పూరి జగన్నాథ్ రథయాత్రకు వెళ్లే భక్తుల కోసం రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 27వ తేదీ రథయాత్ర ప్రారంభం కానుండగా.. జూన్ 25న రాజమండ్రి డిపో నుంచి ఈ ప్రత్యేక బస్సులు బయల్దేరనున్నాయి. జూన్ 25 సాయంత్రం 5 గంటలకు రాజమహేంద్రవరం బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు బయల్దేరతాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ యాత్ర నాలుగు రోజుల పాటు ఉంటుందని వివరించారు. నాలుగు రోజుల్లో 7 ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శి్ంచుకునేలా ఆర్టీసీ అధికారులు ఈ యాత్రను రూపొందించారు.
మరోవైపు పూరి జగన్నాథుడి యాత్ర కోసం రాజమహేంద్రవరం ఆర్టీసీ అధికారులు సూపర్ లగ్జరీ బస్సులను ప్రత్యేక బస్సులుగా నడుపుతున్నారు. పుష్‌బ్యాక్ 2ప్లస్2 సీట్లు, టీవీ ఉన్న బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ప్యాకేజీలో భాగంగా ఏడు ఆలయాలను దర్శించుకునే అవకాశం ఉంది. సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి, అరసవిల్లి సూర్యభగవానుడి ఆలయం, శ్రీకూర్మం కూర్మనాథస్వామి, భువనేశ్వర్‌లో కొలువైన లింగరాజుస్వామి, సాక్షిగోపాల్‌లో ఉన్న వేణుగోపాలస్వామి, కోణార్క్, పూరిలో జగన్నాథ స్వామి ఆలయాలను భక్తులు దర్శించుకోవచ్చు.
ఈ యాత్ర కోసం ఒక్కొక్కరికి టికెట్ ధరను రూ.3,500గా రాజమహేంద్రవరం ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. అయితే టిఫిన్లు, భోజనాల వంటి ఖర్చులను భక్తులే భరించాల్సి ఉంటుంది. ఎక్కడైనా హోటల్స్‌లో బస చేసినా.. ఆ ఖర్చులను కూడా పర్యాటకులే భరించాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఒక్క బస్సులో సీట్లు నిండిన తర్వాత మరో బస్సును ఏర్పాటు చేస్తామని.. ఎన్ని బస్సులైనా నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇతర వివరాలకు భక్తులు రాజమహేంద్రవరం ఆర్టీసీ ప్రధాన బస్టాండ్‌లోని రిజర్వేషన కౌంటర్ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.
Latest News