స్విస్ బ్యాంకుల్లో మూడింతలు పెరిగిన భారతీయుల డబ్బు
 

by Suryaa Desk | Fri, Jun 20, 2025, 06:28 PM

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు మూడు రెట్లు పెరిగినట్టు తాజా నివేదిక వెల్లడించింది. స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంక్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.., 2024లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నగదు డిపాజిట్లు మూడింతలు పెరిగి 3.5 బిలియన్ స్విస్ ఫ్రాంకులకు (సుమారు ₹37,600 కోట్లకు) చేరింది. ఈ పెరుగుదలకు ప్రధానంగా స్థానిక శాఖలు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా వచ్చిన నిధులే వృద్ధే కారణమని నివేదిక పేర్కొంది. అయితే, ప్రత్యక్షంగా కస్టమర్ ఖాతాలలో ఉన్న నగదు కేవలం 11 శాతం మాత్రమే పెరిగి 346 మిలియన్ స్విస్ట్ ఫ్రాంకులు (సుమారు ₹3,675 కోట్లు)కి చేరుకుంది. ఇది మొత్తం నిధులలో దాదాపు పదో వంతు మాత్రమే.


స్విస్ జాతీయ బ్యాంకు గణాంకాల ప్రకారం 2023లో భారతీయుల డిపాజిట్లు గణనీయంగా తగ్గి.. ఇప్పుడు తిరిగి పెరుగుదల నమోదుచేశాయి. 2023లో వ్యక్తులు, కంపెనీలు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నగదు 70 శాతం తగ్గి, నాలుగేళ్ల కనిష్ఠానికి 1.04 బిలియన్ స్విస్ ఫ్రాంకులకు పడిపోయింది. కానీ 2024లో ఈ మొత్తం మళ్లీ భారీగా పెరగడం గమనార్హం. 2021 తర్వాత అత్యధిక స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి అని నివేదిక వ్యాఖ్యానించింది. ఆ ఏడాది భారతీయుల బ్యాలెన్సులు 14 ఏళ్ల గరిష్ఠాన్ని తాకాయి. ఏకంగా 3.83 బిలియన్ స్విస్ ఫ్రాంకులకు చేరుకున్నాయి.


స్విస్ నేషనల్ బ్యాంకు గణాంకాల ప్రకారం కస్టమర్ డిపాజిట్లు 346 మిలియన్ స్విస్ ఫ్రాంకులు (2022లో 310 మిలియన్ల నుంచి స్వల్ప పెరుగుదల), ఇతర బ్యాంకుల ద్వారా 3.02 బిలియన్ ఫ్రాంకులు (2022లో 427 మిలియన్లు), అలాగే, ట్రస్ట్‌లు లేదా నిధులు ద్వారా 41 మిలియన్ ఫ్రాంకులు ( 2022లో 10 మిలియన్లు), బాండ్లు, సెక్యూరిటీల రూపంలో 135 మిలియన్ ఫ్రాంకులు (2022లో 293 మిలియన్లు ఉండగా.. 2024లో భారీగా పడిపోయింది)


2006లో దాదాపు 6.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లతో రికార్డు స్థాయికి చేరుకుని.. కొన్నేళ్లు మినహా 2011, 2013, 2017, 2020, 2021, 2022 , 2023 సంవత్సరాలతో సహా ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పట్టింది. SNB ప్రకారం.. వ్యక్తులు, బ్యాంకులు, సంస్థల డిపాజిట్‌లతో సహా స్విస్ బ్యాంకులలోని భారతీయ కస్టమర్ల అన్ని రకాల నిధులను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇందులో భారత్‌లో స్విస్ బ్యాంకుల శాఖల డేటా, అలాగే డిపాజిట్‌లు కానివి కూడా ఉన్నాయి. మరోవైపు, స్విస్ బ్యాంకులలో భారతీయులకు అత్యంత నమ్మకమైన బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్ (BIS) స్థానిక బ్యాంకింగ్ గణాంకాలు దాదాపు 6 శాతం పెరుగుదలను నమోదుచేశాయి. కాగా, స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి.. పేదలకు పంచుతామని 2014 ఎన్నికల్లో బీజేపీ ప్రచారం చేసిన విషయం తెలిసిందే.


బ్లాక్ మనీ కాదు


స్విస్ నేషనల్ బ్యాంక్ (SNB) తెలిపిన గణాంకాలు అధికారికంగా బ్యాంకులు నివేదించినవి మాత్రమే. ఇవి నల్లధనానికి సంబంధించినవి కావు. అలాగే, ఈ గణాంకాలు ఇతర దేశాల సంస్థల పేర్లపై ఉన్న ఖాతాలను లేదా ఎన్‌ఆర్‌ఐల ఖాతాలను కూడా పరిగణనలోకి తీసుకోవు. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) గణాంకాలు కూడా విడుదలయ్యాయి, ఇవి వ్యక్తుల డిపాజిట్లకు మరింత ఆధారం. ఈ లెక్కల ప్రకారం.. 2024లో భారతీయుల డిపాజిట్లు సుమారు 6 శాతం పెరిగి 74.8 మిలియన్ డాలర్లు (రూ. 650 కోట్లు)కి చేరాయి. 2023లో 25%, 2022లో 18%, 2021లో 8% తగ్గితే.. 2020లో 39% పెరిగింది. 2007లో గరిష్టంగా 2.3 బిలియన్ డాలర్లు (రూ. 9,000 కోట్లు) కావడం విశేషం.


భారత్–స్విట్జర్లాండ్ మధ్య సమాచార మార్పిడి


2018 నుంచి భారత్–స్విట్జర్లాండ్ మధ్య ఆర్థిక లావాదేవీ సమాచార మార్పిడి వ్యవస్థ అమల్లోకి వచ్చింది. మొదటిసారి 2019లో స్విస్ బ్యాంకుల్లోని భారత ఖాతాదారుల పూర్తి డేటా కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇది జరుగుతోంది. ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు భావించే ఖాతాల గురించి ఇప్పటికే వందల కేసుల్లో సమాచారం ఇచ్చినట్టు స్విస్ అధికారులు తెలిపారు.


కాగా, ఇతర దేశాల విషయానికి వస్తే 2024లో నిధులు CHF 977 బిలియన్ స్విస్ ఫ్రాంకుల మేర తగ్గాయి (2023లో 983 బిలియన్ ఫ్రాంకులు). ఇదే సమయంలో భారతీయుల ఆస్తుల విలువ CHF 1.59 బిలియన్గు ఉంది (9% వృద్ధి). ఈ జాబితాలో 222 బిలియన్ స్విస్ ఫ్రాంకులతో యూకే మొదటి స్థానంలో ఉండగా.. తర్వాత అమెరికా ( 89 బిలియన్ ఫ్రాంకులు), వెస్ట్ ఇండీస్ ( CHF 68 బిలియన్), జర్మనీ, ఫ్రాన్స్, హాంకాంగ్, లక్సెంబర్గ్, సింగపూర్, గుర్నేస్, యూఏఈ ఉన్నాయి. ఇక, 2023 చివర్లో 67వ స్థానంలో ఉన్న భారత్.. 2024 చివరికి 48వ స్థానానికి చేరింది. కానీ 2022లో 46వ స్థానంతో పోలిస్తే తక్కువే.


దాయాది పాకిస్థాన్ డిపాజిట్లు: 272 మిలియన్ ఫ్రాంకులు (2023లో 286 మిలియన్ల) , బంగ్లాదేశ్ డిపాజిట్లు భారీ వృద్ధి నమోదుచేసింది. అది CHF 18 మిలియన్ల నుంచి CHF 589 మిలియన్‌కు చేరింది. భారత్ మాదిరిగానే ఈ రెండు దేశాల్లో కూడా స్విస్ బ్యాంకుల్లోని బ్లాక్ మనీ రాజకీయ ప్రాధాన్యత అంశమే.

Latest News
Surveillance Tightened After Mysterious Deaths of 5 Children in Salumbar Trigger Panic; Probe Ordered Tue, Apr 07, 2026, 12:16 PM
Crude oil prices surge over 3 pc over Iran tensions, Trump deadline Tue, Apr 07, 2026, 12:15 PM
Brazil launches measures to cushion fuel price hikes Tue, Apr 07, 2026, 12:14 PM
Samsung Electronics Reports Record Q1 Operating Profit, Beats Market Expectations Tue, Apr 07, 2026, 12:12 PM
I&B Ministry Extends TRP Suspension to Curb Sensational News Coverage Amid West Asia Conflict Tue, Apr 07, 2026, 12:09 PM