|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 06:35 PM
పల్నాడులో బెట్టింగ్‌లో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించడంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బెట్టింగ్‌లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు జగన్ పరామర్శ చేయడం ఏంటి అని ప్రశ్నించారు. వారికి విగ్రహాలు కట్టడం ఏంటని.. సమాజం ఎటు పోతుందని అన్నారు. జగన్ ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని.. బల ప్రదర్శనలు కాదు అంటూ హితవుపలికారు. జగన్ బీజేపీకి దత్తపుత్రుడు కాబట్టి..అన్ని అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. దగ్గరుండి బలప్రదర్శనలు చేయిస్తున్నారన్నారు. ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసే కాంగ్రెస్‌కు మాత్రమే ఆంక్షలు విధిస్తున్నారని.. జగన్ పర్యటనలకు ఎందుకు ఆంక్షలు లేవని ఏపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. తాము రాజధాని మీద పోరాటం చేయాలి అనుకుంటే హౌజ్ అరెస్ట్‌లు చేస్తారన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం చేసే దీక్షలు భగ్నం చేస్తారని.. ఆంక్షలు అన్ని కాంగ్రెస్ పార్టీకేనా అని నిలదీశారు. బీజేపీకి ఎదురు నిలబడి ధైర్యంగా పోరాటం చేస్తున్నందుకు కాంగ్రెస్‌ను అడ్డుకుంటున్నారా అని నిలదీశారు. జగన్ మీద ఎందుకు ఆంక్షలు లేవని అడిగారు. బల ప్రదర్శన మీద ఎందుకు ఆంక్షలు పెట్టడం లేదని.. జగన్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయనా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
Latest News