|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 05:05 PM
తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న ఓ నిర్ణయానికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పూర్తి మద్దతు తెలిపారు. ఈ విషయంలో టీటీడీకి నా ఫుల్ సపోర్ట్ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అసలు విషయంలోకి వస్తే.. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరుమల శ్రీవారి పేరు పెట్టాలని టీటీడీ ధర్మకర్తల మండలి మంగళవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది. రేణిగుంట ఎయిర్‌పోర్టుకు శ్రీవెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అంటూ పేరు పెట్టాలని ప్రతిపాదిస్తూ.. కేంద్ర పౌరవిమానయాన శాఖకు టీటీడీ లేఖ రాయనుంది.
ఈ విషయంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ( రేణిగుంట)కు శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అని పేరు మార్చాలన్న టీటీడీ ప్రతిపాదనకు తాను పూర్తిగా మద్దతిస్తున్నట్లు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. టీటీడీ ప్రతిపాదించిన పేరు సరిగ్గా సరిపోతుందన్న విజయసాయిరెడ్డి.. తిరుమల శ్రీవారికి ఉన్న ప్రపంచవ్యాప్త గుర్తింపు, తిరుమల ఆధ్యాత్మిక పవిత్రతకు సరైన గౌరవం ఇచ్చినట్లు అవుతుందన్నారు.
మరోవైపు మంగళవారం అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ వివరాలను విలేకర్ల సమావేశంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. తిరుపతి ఎయిర్‌పోర్టు పేరు మార్పు ప్రతిపాదనతో పాటుగా విమానాశ్రయంలో ఆధ్యాత్మిక శోభను తెచ్చేందుకు ఆర్కిటెక్చర్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు.
కేంద్ర మంత్రి కుమారస్వామి తిరుమలకు వంద ఈవీ బస్సులు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు, ఈ ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వస్తే శ్రీవారి భక్తులకు ఉచిత ప్రయాణం లభిస్తుందన్నారు. అలాగే బెంగళూరులో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం తిరుపతిలో సీఐఎస్ఆర్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సీఐఎస్ఆర్ ల్యాబ్‌కు లీజు పద్ధతిలో టీటీడీ స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించింది. దీనిద్వారా టీటీడీ వినియోగించే నెయ్యి, నీరు, ఆహార పదార్థాల నాణ్యతను ఉచితంగా తనిఖీ చేసేందుకు అవకాశం ఉంటుంది.
Latest News