|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 05:01 PM
జాతీయ రహదారులపై ప్రయాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతించారు. భారతదేశం రహదారుల మౌలిక సదుపాయాల ప్రయాణంలో ఇదో గేమ్ ఛేంజర్ అని అభిప్రాయపడ్డారు. ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. భారత్ రోడ్డు మౌలిక సదుపాయాల ప్రయాణానికి ఇదో గేమ్ ఛేంజర్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయంతో వాహన యజమానులు, ముఖ్యంగా సమీప గ్రామాల నుంచి.. తరచుగా హైవేలో ప్రయాణించే వారికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ వ్యవస్థను ప్రవేశపెట్టినందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఫాస్టాగ్ వార్షిక పాస్ టోల్ చెల్లింపులను సరళీకృతం చేయడంతో పాటుగా.. ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుందని.. ప్రైవేట్ వాహన యజమానులకు పెద్ద ఉపశమనం కలిగించే ఒక సమగ్ర, పౌర స్నేహపూర్వక సంస్కరణగా పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. "రూ. 3,000 వార్షిక పాస్ కేవలం ఆర్థిక ఉపశమనం మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా సున్నితమైన, వేగవంతమైన , వివాదాలు లేని హైవే ప్రయాణం వైపు ఒక అడుగు. ఇది ముఖ్యంగా టోల్ ప్లాజాల దగ్గర నివసించే ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది, వారి సమయం. భారాన్ని తగ్గిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ప్రజా-కేంద్రీకృత పాలన పట్ల గడ్కరీ నిబద్ధతను ప్రతిబింబిస్తూ ఇది నెరవేరిన వాగ్దానం." అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
మరోవైపు ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్.. స్వాతంత్ర్య దినోత్సవం రోజు (ఆగస్ట్ 15) నుంచి అందుబాటులోకి రానుంది. వాహనదారులు రూ.3 వేలు చెల్లించి ఈ ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. యాక్టివేట్ చేసిన పాస్‌లతో ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకూ ఏది ముందు పూర్తి అయితే అప్పటి వరకూ చెల్లుబాటు అవుతుంది.
జీపులు, కార్లు, వ్యాన్లు వంటి నాన్- కమర్షియల్ వాహనాలకు ఈ ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ వర్తిస్తుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. టోల్‌ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఇది ఉపయోగపడనుంది. అలాగే లక్షలాది మంది ప్రైవేటు వాహనదారులకు సుఖవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం చేసేందుకు వీలు కుదరనుంది.
Latest News