|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 09:56 AM
చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకున్న అమానుష ఘటన, ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఉదంతంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే తానే రంగంలోకి దిగుతానని ఆయన హెచ్చరించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను లేఖ రాశానని... తన లేఖకు వారం రోజుల్లోగా రిప్లై ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక విషయంలో చంద్రబాబును అభినందిస్తున్నానని... మహిళను కట్టేసి కొట్టిన విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు స్పందించారని ప్రశంసించారు.కుప్పం ఘటనలో బాధితురాలిని కొట్టిన వ్యక్తులపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే శాశ్వత పరిష్కారాలు అవసరమని పాల్ నొక్కిచెప్పారు. "ఇలాంటి విషయాలు ఎన్నో జరుగుతున్నాయి. మరోసారి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే అసెంబ్లీలో బిల్లు పెట్టాలి. ప్రభుత్వం సరైన చర్య తీసుకోకపోతే నేనే రంగంలోకి దిగుతా" అని పాల్ ప్రకటించారు.అప్పులిచ్చి వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల తరహాలో ఇక్కడ కూడా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు. "అప్పులిచ్చి మహిళలను కొట్టి, వారి ఆడపిల్లలను ఎత్తుకెళ్లి అప్పులు వసూలు చేసుకుంటున్నారు. ఇది ఎంత దారుణం? అలా వసూలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారికి రూ. 5 లక్షల జరిమానా, 5 ఏళ్ల జైలు శిక్ష విధించాలి. అటువంటి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని సీఎం చంద్రబాబును కోరుతున్నాను" అని పాల్ తెలిపారు.
Latest News