|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 08:37 AM
రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని, పోలీస్ యాక్ట్–30 పేరుతో అడ్డగోలు ఆంక్షలు విధిస్తున్నారని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ఆక్షేపించారు. మాజీ సీఎం వైయస్ జగన్ పర్యటనలపై తీవ్రంగా భయపడుతున్న ప్రభుత్వం, ఎలాగైనా ఆయనను నివారించాలని కుట్ర చేస్తోందని అనంతపురంలో మీడియాతో మాట్లాడిన సాకె శైలజానాథ్ చెప్పారు. సాకె శైలజానాథ్ మాట్లాడుతూ..... రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పరిపాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది. ప్రజా సమస్యలపై చర్చ జరగడం కూడా ఈ ప్రభుత్వానికి ఇష్టం ఉండటం లేదు. నిన్న నేను శింగనమల పర్యటనకు వెళ్తుంటే పోలీస్ యాక్టు–30 అమల్లో ఉందని అనుమతులు లేవని పోలీసులు అడ్డుకున్నారు. రెగ్యులేషన్ అమలు చేయడానికి ప్రయోగించే పోలీస్ యాక్ట్–30ని ప్రతిపక్ష నాయకుల పర్యటనలపై నిషేధాజ్ఞలు అమలు చేయడానికి వాడుకుంటున్నారు. బ్రిటీష్ కాలం, 1861 నుంచి అమల్లో ఉన్న ఈ చట్టాన్ని ప్రతిపక్ష వైయస్ఆర్‌సీపీ నాయకుల పర్యటనలను అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం వాడుకుంటోంది. బ్రిటీష్ ప్రభుత్వంలో ఈ చట్టం అమల్లో ఉన్నా ఉద్యమాలు, సభలు, సమావేశాలు నిర్వహించుకుని దేశానికి స్వాతంత్య్రం తెచ్చుకున్నాం. కానీ అంతకన్నా దారుణంగా ఈ చట్టాన్ని ఏపీలో అమలు చేస్తూ వైయస్ఆర్‌సీపీ నాయకులను నిర్బంధిస్తున్నారు అని మండిపడ్డారు.
Latest News