|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 06:34 PM
రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించిన తుది పాలసీని తీసుకురావాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అంతేకాకుండా, మొదటి దశలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏడాదిలోగా ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో ఆధునిక యంత్రాలను వాడాలని సూచించారు.
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సర్క్యులర్ ఎకానమీపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నాటికి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం సహా 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు. . 87 పట్టణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్-రీయూజ్-రీసైకిల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. వ్యర్థాల నిర్వహణలో బాగా పనిచేసిన వారికి ‘స్వచ్ఛత’ అవార్డులు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని చంద్రబాబు ఆదేశించారు. 90 రోజుల్లో రీసైక్లింగ్, చెత్తను వేరు చేయడంపై ఒక ప్రణాళికను ఇవ్వాలని చంద్రబాబు సూచించారు.. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరులను మళ్లీ ఉపయోగించడం గురించి ప్రధానంగా చర్చించారు. సర్క్యులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటు చేయడానికి మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రతిపాదనలను చంద్రబాబు పరిశీలించారు.
మరోవైపు స్వర్ణాంధ్ర విజన్ 2047ను పక్కాగా అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయడానికి నిపుణులను నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గానికి ఒకరు చొప్పున 175 నియోజకవర్గాలకు యంగ్ ప్రొఫెషనల్స్‌ని నియమించడానికి ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే, ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక నిపుణుడు ఉంటారు. వీరు ఆ నియోజకవర్గం అభివృద్ధికి సహాయం చేస్తారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 అమలు కోసం పనిచేస్తారు. ఇందుకోసం ఇప్పటికే నియామక ప్రక్రియ నడుస్తోంది.
Latest News