|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 11:45 PM
క్రెడిట్ కార్డు యూజర్లకు ఊహించని విధంగా షాకిచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కార్డు ( SBI Card ). తమ కార్డు హోల్డర్లకు అందిస్తున్న పలు ప్రయోజనాల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త మార్పులను జులై 15, 2025 నుంచే అమలులోకి తీసుకొస్తున్నట్లుగా వెల్లడించింది. కొత్త మార్పుల్లో ప్రధానంగా కనీస డ్యూ పేమెంట్ కాలిక్యులేషన్, పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్, ఎంపిక చేసిన ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవరేజీని తొలగింపు వంటివి ఉన్నాయి. మరి ఈ కొత్త మార్పులు తెలుసుకుందాం.
విమాన ప్రమాదాల బీమా ఎత్తివేత
ఎస్‌బీఐ కార్డులపై అందిస్తున్న కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీని తొలగిస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఎంపిక చేసిన ఎస్‌బీఐ కార్డులపై ప్రస్తుతం రూ. 1 కోటి ఇన్సూరెన్స్ కవరేజీ ఇస్తోంది. అయితే, జులై 15, 2025 నుంచే ఎంపిక చేసిన కార్డులకు ఈ రూ.1 కోటి ఇన్సూరెన్స్ వర్తించదని తెలిపింది. ఈ జాబితాలో ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్ (SBI Card Elite), ఎస్‌బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్ ( SBI Card Miles Elite), ఎస్‌బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్ (SBI Card Miles Prime) ఉన్నాయి. ఈ కార్డులు ఉపయోగిస్తున్న కస్టమర్లకు ఇకపై ఎలాంటి ఇన్సూరెన్స్ వర్తించదని గుర్తుంచుకోవాలి. అలాగే రూ.50 లక్షల వరకు ఎయిర్ యాక్సిడెంట్ కవరేజీ లభిస్తోన్న ఎస్‌బీఐ కార్డు ప్రైమ్, ఎస్‌బీఐ కార్డ్ ప్లస్ లకు సైతం ఇకపై తొలగిస్తున్నట్లు తెలిపింది.
మరోవైపు.. ఎస్‌బీఐ కో- బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై ఇస్తున్న రూ.1 కోటి ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీని ఆగస్టు 11,2025 నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. అందులో యూకో బ్యాంక్ ఎస్‌బీఐ కార్డ్ లైట్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్, బీఎస్‌బీ ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్, కేవీబీ ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్, కేవీబీ ఎస్‌బీఐ సిగ్నేచర్ కార్డ్, అలహాబాద్ బ్యాంక్ ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్ ఉన్నాయి. అలాగే రూ.50 లక్షల ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇస్తోన్న కో బ్రాండ్ కార్డులపైనా ఎత్తి వేస్తున్నట్లు తెలిపింది.
మినిమమ్ అమౌంట్ డ్యూ కాలిక్యులేషన్..
జులై 15, 2025 నుంచి కనీస మొత్తం డ్యూ లెక్కల్లోనూ కీలక మార్పులు చేస్తోంది. 100 శాతం జీఎస్టీ ప్లస్ 100 శాతం ఈఎంఐ అమౌంట్ ప్లస్ 100 శాతం ఛార్జీలు ప్లస్ 100 శాతం ఫైనాన్స్ ఛార్జీలు ప్లస్ ఏదైనా ఓవర్ లిమిట్ అమౌంట్ ప్లస్ 2 శాతం ఔట్ స్టాండింగ్ బ్యాలెన్స్ లెక్కిస్తారు. అలాగే ఆర్డర్ ఆఫ్ పేమెంట్ సెటిల్మెంట్‌లోనూ కొత్త మార్పులు జులై 15 నుంచే అమలులోకి వస్తాయి.
Latest News