|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 11:40 PM
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌ను వీడనున్నాడా? అతడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్ 2025 సందర్భంగా సంజూ శాంనస్‌కు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు మధ్య విభేదాలు తలెత్తాయని, మేనేజ్‌మెంట్‌తోనూ అతడికి పడట్లేదని వార్తలు వచ్చాయి. దీంతో అతడు ఫ్రాంఛైజీ మారాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి తోడు తాజాగా సంజూ శాంసన్.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన పోస్ట్ ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.
ఇటీవల సంజూ శాంసన్.. తన భార్య చారులత రమేష్‌తో కలిసి ఫారెన్ టూర్ వెళ్లాడు. ఈ మేరకు తన భార్యతో కలిసి దిగిన ఫొటోను సంజూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. అయితే ఈ పోస్టుకు 'వెళ్లాల్సిన సమయం వచ్చింది' అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఇదే కొత్త ఊహాగానాలకు తెరలేపింది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు.. సంజూ శాంసన్ ఎల్లో లైన్ దాటుతున్న ఫొటోను షేర్ చేశాడని.. తమిళ్ సాంగ్‌ను యాడ్ చేశాడని.. దీంతో అతడు సీఎస్కేలోకి వెళ్లడం ఖాయమని పేర్కొంటున్నారు. ఫ్యాన్స్ కోసం హింట్ కూడా ఇచ్చేశాడని కామెంట్లు చేస్తున్నారు.
ఇదే సమయంలో మరో వాదనను సైతం నెటిజన్లు తెరమీదకు తెచ్చారు. సంజూ శాంసన్ మేనేజర్ ప్రశోబ్ సుదేవన్ కూడా సంజూ సీఎస్కేలోకి వెళ్తాడని హింట్ ఇచ్చారని చెబుతున్నారు. సంజూ సీఎస్కేలోకి వెళ్తాడని రాసి ఉన్న పోస్టుకు అతడు లైక్ కొట్టాడు. దీంతో ఐపీఎల్ 2026లో శాంసన్‌ను యెల్లో జెర్సీలో చూడటం ఖాయమని పేర్కొంటున్నారు.
ఒకవేళ సీఎస్కే.. సంజూను తీసుకోవాలంటే.. ట్రేడ్ ద్వారా దక్కించుకోవచ్చు. గతంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను.. ముంబై ఇండియన్స్ తీసుకున్నట్లుగా ట్రేడ్ ద్వారా తీసుకోవచ్చు. ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే ఇప్పటివరకు ఒకేసారి ట్రేడ్ చేసింది. 2020లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్, వికెట్ కీపర్ రాబిన్ ఉతప్పను తీసుకుంది. వచ్చే సీజన్‌లోనూ సంజూను తీసుకోవాలని అనుకుంటే సీఎస్కే మళ్లీ రాజస్థాన్ నుంచే వికెట్ కీపర్, బ్యాటర్‌ను తీసుకున్నట్లు అవుతుంది. కాగా సంజూ శాంసన్, సీఎస్కే మధ్య ఇదివరకే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
Latest News