|
|
by Suryaa Desk | Thu, Jun 12, 2025, 12:01 PM
తత్కాల్ టికెట్ల బుకింగ్ లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇందులో సంభవిస్తోన్న అక్రమాలు, అవకతవకలను అరికట్టాలనే ఉద్దేశంతో రైల్వే మంత్రిత్వ శాఖ దీనికి శ్రీకారం చుట్టింది.త్వరలోనే ఇవి అమలులోకి రానున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఈ-ఆధార్ అథెంటికేషన్ ఇక తప్పనిసరి కానుంది. ఆధార్ అథెంటికేషన్ ఉంటేనే ప్రయాణికులు తమ తత్కాల్ టికెట్ల బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సంబంధిత శాఖకు ప్రతిపాదనలను అందజేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ దీన్ని ఆమోదించింది. జులై 1వ తేదీ నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్ లో ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి కానుంది. ఈ- ఆధార్ అథెంటికేషన్ వల్ల అనధికార టికెట్ బుకింగ్ ఏజెంట్లు.. నకిలీ అకౌంట్లను ఉపయోగించి ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ టికెట్లను చేయలేరు. రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో సమూల మార్పులను తీసుకురావడంలో భాగంగా ఈ ప్రక్రియను చేపట్టింది రైల్వే శాఖ. జూలై 15 నుంచి ఆధార్ ఆధారిత ఓటీపీ ధృవీకరణ కూడా తప్పనిసరిగా చేయాలని నిర్ణయించింది. టికెట్ బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికుడి ఆధార్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఇందులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతానికి తత్కాల్ టికెట్లకే వర్తింపజేసింది. భవిష్యత్తులో సాధారణ రిజర్వేషన్లకూ దీన్ని వర్తింపజేసే అవకాశాలు లేకపోలేదు. అనధికార టికెట్ బుకింగ్ పద్ధతులను అరికట్టాల్సిన అవసరం ఉందని రైల్వేశాఖ పేర్కొంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చామని ఐఆర్సీటీసీ తెలిపింది. డిస్పోజబుల్ ఇ-మెయిళ్లతో టికెట్లను బుక్ చేసుకోవడాన్ని కూడా అరికట్టబోతోంది. అప్పటికప్పుడు నకిలీ ఇ-మెయిళ్లను సృష్టించి టికెట్లను బుక్ చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నట్లు వివరించింది. అలాంటి యూజర్ ఐడీలను గుర్తించడం, వాటిని డీ యాక్టివేట్ చేయడానికి ఈ ఏఐ ఆధారిత టూల్స్ ను వినియోగించనుంది. ఏడాది కాలంలో ఐఆర్సీటీసీలో 35 మిలియన్లకు అనధికారిక యూజర్ ఐడీలను బ్లాక్ చేశామని రైల్వే మంత్రిత్వ శాఖ గతంలోనే వెల్లడించిన విషయం తెలిసిందే. దీని వల్ల తత్కాల్ టికెట్ల బుకింగ్ ప్లాట్‌ఫామ్ పై తాకిడి గణనీయంగా తగ్గిందని ఆ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ-ఆధార్ అథెంటికేషన్ ను అమలు చేయడం ద్వారా నకిలీల బెడద మరింత తగ్గుతుందని అన్నారు.
Latest News