![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 07:16 PM
ఐపీఎల్‌లో తొలిసారి విజేతగా నిలిచి కప్ సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు.. కర్ణాటక రాజధాని బెంగళూరుకు వచ్చిన సందర్భంగా జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆ తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దుమారానికి కారణం అయింది. ఈ కేసులో ఇప్పటికే కొన్ని అరెస్ట్‌లు కాగా.. పలు ఫిర్యాదులు కూడా అందాయి. ఇక ఆ కేసు కర్ణాటక హైకోర్టు పరిధిలో ఉండగా.. రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. కర్ణాటకలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ నిర్వహణ లోపం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని ప్రతిపక్ష బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో తమకేం సంబంధం లేదని సిద్ధరామయ్య ప్రభుత్వం వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వివాదం కాస్తా.. గవర్నర్-ముఖ్యమంత్రి గొడవకు దారి తీసింది.
ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా బెంగళూరులోని విధాన సౌధలో నిర్వహించిన కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించగా.. దాన్ని ఖండిస్తూ తాజాగా రాజ్‌భవన్ ప్రకటన రిలీజ్ చేసింది. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్‌ను స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యనే అధికారికంగా ఈ సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించినట్లు రాజ్‌భవన్ స్పష్టం చేసింది. మొదట ఆర్సీబీ జట్టు ఆటగాళ్లకు రాజ్‌భవన్‌లోనే ఆతిథ్యం ఇవ్వాలని భావించారని.. ఈ అంశంపై గవర్నర్ కార్యాలయం కర్ణాటక రాష్ట్ర చీఫ్ సెక్రటరీని సంప్రదించిందని.. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కోరిందని తాజాగా రాజ్‌భవన్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.
కానీ దానికి బదులుగా సిద్ధరామయ్య ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని విధాన సౌధాలో నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎస్ తెలిపారు. విధాన సౌధలో ఏర్పాటు చేసే ఆర్సీబీ జట్టు అభినందన కార్యక్రమానికి హాజరు కావాలని గవర్నర్‌ను ముఖ్యమంత్రి అధికారిక ఆహ్వానం పలికినట్లు ఆ ప్రకటనలో రాజ్‌భవన్ పేర్కొంది. మరోవైపు.. ఈ తొక్కిసలాట ఘటనపై కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ జాగ్రత్త వహిస్తోంది. తొక్కిసలాట ఘటన చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిందని.. విధానసౌధ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదని చెబుతోంది. రాజకీయాల కోసం కావాలనే ప్రతిపక్షాలు ఈ తొక్కిసలాట ఘటనను వాడుకుంటున్నాయని సిద్ధరామయ్య సర్కార్ ఆరోపించింది.
చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట కేసును తమ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ఇటీవలె సీఎం సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. అయితే ఆ ఈవెంట్‌కు తాను గెస్ట్‌ను మాత్రమేనని వెల్లడించారు. తొక్కిసలాటకు సంబంధించిన విషయం తనకు 2 గంటల తర్వాత తెలిసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇక విధానసౌధలో జరిగిన వేడుకకు క్రికెట్ వర్గాల నుంచి తనకు ఆహ్వానం అందిందని.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాదని కూడా పేర్కొన్నారు. ఇక తనను చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగే కార్యక్రమానికి ఆహ్వానించలేదని వివరించారు.
ఇక ఈ కార్యక్రమం జరగడానికి ముందే అసెంబ్లీ భద్రతను చూసే డీసీపీ ఎంఎన్ కరిబసవన గౌడ.. సంబంధిత ఉన్నతాధికారులకు ఒక లేఖ రాశారు. ఆర్సీబీకి దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారని.. విధానసౌధలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే.. లక్షలాది మంది అభిమానులు వచ్చే అవకాశం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా సిబ్బంది కొరత వల్ల అంత మందిని కంట్రోల్ చేయడం చాలా కష్టమని వెల్లడించారు. అంతేకాకుండా స్టేడియంలోకి వచ్చే వారికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో జారీ చేసే ఎంట్రీ పాస్‌లను కూడా నిలిపివేయాలని విజ్ఞప్తి చేసినా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
Latest News