|
|
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 08:57 PM
దేశంలో ఇంటర్నెట్ అందుబాటు లేని మారుమూల ప్రాంతాలకు ఇక హైస్పీడ్ కనెక్టివిటీ అందనుంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించే స్టార్‌లింక్, భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి కీలక అనుమతులు పొందిన స్టార్‌లింక్ , రెండు నెలల్లోపే సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన వన్‌వెబ్, రిలయన్స్ జియో వంటి సంస్థలు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు అనుమతులు పొందగా, స్టార్‌లింక్ ప్రవేశంతో ఈ రంగంలో పోటీ మరింత పెరగనుంది. స్టార్‌లింక్ తన వ్యూహంలో భాగంగా ఒక నెల ఉచిత ట్రయల్‌ను అందించాలని యోచిస్తోంది.
స్టార్‌లింక్ ధరలు: సాధారణ ఇంటర్నెట్ కంటే ఎక్కువేనా?
స్టార్‌లింక్‌కు సంబంధించిన ధరలు, హార్డ్‌వేర్ ఖర్చులపై ప్రస్తుతం విస్తృత చర్చ జరుగుతోంది. సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం, భారతదేశంలో స్టార్‌లింక్ తన ధరలను ఇతర పొరుగు దేశాలకు అనుగుణంగానే నిర్ణయించే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్, భూటాన్‌లలో కూడా స్టార్‌లింక్ పరికరం ధర రూ. 33,000గా ఉంది, ఇది ప్రాంతాల్ని బట్టి మారొచ్చు. భారత్‌లో ఇంతే ఉండొచ్చని ప్రస్తుతానికి అనుకుంటున్నారు. అయితే, దేశంలోని ప్రధాన నగరాల్లో జియో, ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు 100 MBPS వేగంతో అపరిమిత డేటాను రూ.1,000 లోపే అందిస్తున్నాయి. వాటికి ఓటీటీ, టీవీ ప్రయోజనాలు అదనం. దీనితో పోలిస్తే స్టార్‌లింక్ ధర చాలా ఎక్కువ అనిపించొచ్చు.
స్టార్‌లింక్: ఎందుకు ప్రత్యేకం?
సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం సవాలుగా ఉన్న లేదా అసలు లేని భారతదేశంలోని మారుమూల, సేవలు అందని ప్రాంతాలకు కనెక్టివిటీని అందించడమే స్టార్‌లింక్ ప్రధాన లక్ష్యం. ఉపగ్రహాల నుంచి కాకుండా, స్టార్‌లింక్ తన సేవలను లో ఎర్త్ ఆర్బిట్ (LEO) ఉపగ్రహాల ద్వారా అందిస్తుంది. ఇవి భూమికి 550 కిలోమీటర్ల ఎగువన ఉంటాయి. స్టార్‌లింక్‌కు ప్రస్తుతం 7,000 LEO ఉపగ్రహాలు ఉండగా, క్రమంగా వీటి సంఖ్యను 40,000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ LEO ఉపగ్రహాలు గతంలో కనెక్టివిటీకి అందుబాటులో లేని దూర ప్రాంతాలకు అధిక-వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించడానికి సహాయపడతాయి. ప్రస్తుతం స్టార్‌లింక్ 100కు పైగా దేశాల్లో సేవలు అందిస్తోంది.
స్టార్‌లింక్ లైసెన్స్ పొందినా, వాణిజ్య శాట్‌కామ్ స్పెక్ట్రమ్ కోసం కొంత సమయం ఎదురుచూడాల్సి వస్తుంది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఇప్పటికే ఈ సేవల కోసం స్పెక్ట్రమ్ ధరలు, నిబంధనలు, షరతులపై సిఫార్సులను ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం తుది మార్గదర్శకాలను నిర్దేశించి, స్పెక్ట్రమ్ కేటాయింపులు చేస్తేనే స్టార్‌లింక్ తన సేవలను ప్రారంభించగలదు. ఈ ప్రక్రియలన్నీ పూర్తి కావడానికి మరో ఏడాది గడువు పడుతుందనేది అంచనా. అయినప్పటికీ, ఎలాన్ మస్క్ సంస్థ.. వచ్చే రెండు నెలల్లోనే సేవలు ప్రారంభించాలనే ఉద్దేశంతో ఉంది.