|
|
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 07:36 PM
మలేసియాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉత్తర మలేసియాలో యూనివర్సిటీ విద్యార్థులను క్యాంపస్‌కు తీసుకు వెళ్తున్న ఓ బస్సు మార్గ మధ్యంలోనే ప్రమాదానికి గురైంది. ముఖ్యంగా ఓ మినీ వ్యాన్‌ను ఢీకొట్టి బోల్తా పడిపోయింది. ఫలితంగా ఆ బస్సులో ఉన్న 15 మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రణాలు కోల్పోయారు. మరో 15 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా ఆస్పత్రిలో చికిత్సపొందుతుండగా.. ఇందులో ఏడుగురు విద్యార్థుల పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు మృతులంతా 25 ఏళ్లు లోపు వారే కాగా.. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కన్నీరు కారుస్తున్నారు. ముఖ్యంగా మృతుల తల్లిదండ్రులు అయితే గుండెలవిసేలా రోదిస్తున్నారు.
ఉత్తర మలేసియాలోని సుల్తాన్ ఇద్రిస్ ఎడ్యుకేషనల్ యూనవర్సిటీకి చెందిన బస్సులో మొత్తంగా 30 మందికి పైగా విద్యార్థులను ఎక్కించుకుని బస్సు క్యాంపస్‌కు బయలు దేరింది. అయితే వేగంగా వెళ్తున్న బస్సు మార్గ మధ్యంలోనే ఎదురుగా వస్తున్న మినీ వ్యానును ఢీకొట్టింది. ఆ తర్వాత వెంటనే బోల్తా పడింది. దీంతో 13 మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారంతా తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులు, అంబులెన్సు సిబ్బందికి సమాచారం అందించారు. అలాగే యూనివర్సిటీ యాజమాన్యానికి కూడా విషయాన్ని తెలిపారు.
ఇలా హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసుల క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను సైతం బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రులకు పంపించారు. అయితే ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరో ఇద్దరు చనిపోగా.. మృతుల సంఖ్య 15కు చేరుకుంది. అలాగే మరో 15 మంది కూడా తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అందులో ఏడుగురి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మిగతా 8 మంది ప్రాణాల నుంచి బయట పడ్డారని.. కాకపోతే ఆస్పత్రిలోనే కొన్నాళ్లు చికిత్సపొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
మృతులు అంతా కూడా 21 ఏళ్ల నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థులే అని వైద్యులు చెప్పగా.. అంతా కన్నీరు పెడుతున్నారు. ఇంత చిన్న వయసు పిల్లలు ఒక్కసారిగా చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అటు యూనివర్సిటీ పిల్లలు, యాజమాన్యం సహా మృతుల తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై మలేసియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సాయం చేయాలని ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖను ఆదేశించారు.
Latest News